అమరావతి రైతుల నిరసనను దాడిగా చిత్రీకరించడం హాస్యాస్పదం: కేశినేని చిన్ని
- రైతుల నిరసనను దాడిగా అభివర్ణించడం సరికాదన్న కేశినేని చిన్ని
- అప్పుడు మూడు రాజధానులు, ఇప్పుడు మావిగన్ అంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపాటు
- అమరావతి అభివృద్ధిని వైసీపీ నేతలు సహించలేకపోతున్నారని విమర్శ
ఉండవల్లిలో వైసీపీ నేతల రాకపై స్థానిక రైతులు, ప్రజలు చేసిన నిరసనను దాడిగా చిత్రీకరించడం హాస్యాస్పదమని కేశినేని చిన్ని విమర్శించారు. గుడివాడ, మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడులు నిజమైన దాడులని అన్నారు. రైతుల నిరసనను దాడిగా అభివర్ణించడం సరికాదని ఆయన అన్నారు. అమరావతి ప్రజలపైనే వైసీపీ నేతలు దాడులు చేశారని ఆరోపించారు.
“అధికారంలో ఉన్నంత కాలం మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు ‘మావిగన్’ అంటూ డ్రామాలు చేస్తున్నారు. అలాంటి వారు అమరావతి వచ్చి మొసలి కన్నీరు కార్చితే ప్రజలు నమ్మరు” అని వ్యాఖ్యానించారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, దాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే బొండా ఉమతో కలిసి శంకుస్థాపన చేశామని... ఈ ఫ్లైఓవర్ తో స్థానికుల ఆస్తుల విలువలు పెరుగుతాయని చెప్పారు.