కొడంగల్‌లో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి... వాటితోనే రేవంత్ గెలిచారా?: కవిత

Did Revanth Reddy win with 33000 duplicate votes asks Kavitha
  • దేశ వ్యాప్తంగా ఎనిమిది సార్లు 'సర్' ప్రక్రియ జరిగిందన్న కవిత
  • బోధన్ లో ఇప్పటి వరకు 7 వేల ఓట్లు తీసేశారని వెల్లడి
  • హైదరాబాద్‌లో ఉండే చాలా మందికి ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయన్న కవిత

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు ‘సర్‌’ ప్రక్రియ జరిగిందని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 వేల ఓట్లు తీసేశారని... దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కేవలం 800 ఓట్లను మాత్రమే తొలగించారని కవిత విమర్శించారు. కానీ తాము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. అక్కడ ఏకంగా 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తేలిందని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతోనే గెలిచారని.. ఈ డూప్లికేట్ ఓట్లతోనే ఆయన గెలిచారా? అనే అనుమానం తమకు ఉందన్నారు. 


సినీనటుడు ప్రకాశ్ రాజ్‌కు రెండు వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించడానికి ఏడేళ్ల సుదీర్ఘ సమయం పట్టిందని ఈసీని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉండే చాలా మంది ఓటర్లకు అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓట్లు ఉన్నాయని, ఈ డూప్లికేట్ ఓట్లను తొలగించడంలో అధికారులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ‘సర్‌’ ప్రక్రియ జరుగుతున్నందున.. రాష్ట్రాల మధ్య ఉన్న ఓటర్ డేటాను లోతుగా పరిశీలన చేయాలని కవిత సూచించారు. ఒక పౌరుడికి దేశంలో ఎక్కడైనా ఒకే ఒక్క చోట మాత్రమే ఓటు ఉండేలా చూడాలని అన్నారు. డూప్లికేట్ ఓట్ల స్కామ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Kalvakuntla Kavitha
Revanth Reddy
Kodangal Constituency
Duplicate Votes Scam
Telangana Voter List Revision
Election Commission of India

More Telugu News