ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వించండి: సీఎం చంద్రబాబు
- అమరావతి నిర్మాణంలో భాగమైనందుకు గర్వపడాలన్న సీఎం
- నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలకు ఆదేశం
- రూ.50,999 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి
- ప్రతి రెండు నెలలకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్ష జరుపుతామన్న చంద్రబాబు
- అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ఐకానిక్‌గా ఉండాలని సూచన
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నాం. ఇది యావత్ దేశానికి గర్వకారణంగా నిలవాలి. అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో మేం భాగస్వాములం అయ్యామన్న ఆలోచనతో కాంట్రాక్టర్లు పనిచేయాలి" అని సూచించారు.
నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు రాష్ట్రానికి ఐకానిక్ నిర్మాణాలుగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం రాజధాని పరిధిలో రూ.50,999 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్‌ఫ్రా, ఎల్పీఎస్ ఇన్‌ఫ్రాతో పాటు కీలకమైన ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. పనుల వేగవంతానికి అవసరమైన యంత్రాలు, మానవ వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు పనుల్లో నిమగ్నమై ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తులో వరద ముంపు సమస్యలు తలెత్తకుండా కొండవీటి వాగు, పాలవాగులను వెడల్పు చేస్తున్నామని తెలిపారు.
గత పాలకులు ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేశారని, రెండేళ్లుగా తాము మళ్లీ పనులను గాడిలో పెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలోని పవిత్ర క్షేత్రాల నుంచి మట్టి, నీరు తెచ్చి పునీతం చేసిన ఈ ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అయినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.
నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించేందుకు ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం అవుతానని తెలిపారు. నిర్మాణాలు పూర్తయ్యాక, ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ సమీక్షలో సీఆర్డీఏ అధికారులు, వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.