ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం రికమెండేషన్ అడిగే రోజులు వచ్చాయి: నారా లోకేశ్
Add ap7am to your home Screen

ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం రికమెండేషన్ అడిగే రోజులు వచ్చాయి: నారా లోకేశ్

Nara Lokesh aims to bring 2 lakh private students to government schools next year
  • షైనింగ్ స్టార్లే ప్రభుత్వ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్లు అన్న మంత్రి లోకేశ్
  • వచ్చే ఏడాది ప్రైవేటు నుంచి 2 లక్షల మందిని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించడమే లక్ష్యం
  • విద్యార్థుల కోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టామని వెల్లడి
  • టెన్త్, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' పేరిట సత్కారం
వచ్చే ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరాలన్నదే తన లక్ష్యమని, ఈ మార్పునకు ‘షైనింగ్ స్టార్లే’ బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ విద్యా నమూనా గురించే మాట్లాడుకోవాలని ఆకాంక్షించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ఘనంగా సత్కరించారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో టెన్త్ టాపర్లు 55 మందికి రూ. 30 వేల నగదు బహుమతి, ఇంటర్ టాపర్లు 61 మందికి ల్యాప్‌టాప్‌లు, పతకాలు అందజేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. “నిద్రలో కనిపించేది కల కాదు, మిమ్మల్ని నిద్రపోనివ్వనిదే నిజమైన కల. నిద్రపోకుండా మీరు పడిన కష్టమే మిమ్మల్ని షైనింగ్ స్టార్స్‌గా నిలబెట్టింది. మీరు గెలిచారు, నన్ను గెలిపించారు, మన విద్యావ్యవస్థను గెలిపించారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. మీ పనితీరు వల్ల మంత్రిగా నాకు, 2 లక్షల మంది ఉపాధ్యాయులకు గౌరవం పెరిగింది” అని విద్యార్థులను ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సులు అడిగే రోజులు వచ్చాయని, మంగళగిరిలో ఒక తల్లి తనను నిడమర్రు స్కూలులో సీటు ఇప్పించాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు.

విద్యారంగంలో సమూల మార్పులు
విద్యాశాఖను వ్యవసాయంతో పోల్చిన లోకేశ్, ఫలితాలు వెంటనే రావని, నిరంతరం శ్రమిస్తేనే పంట చేతికొచ్చిన ఆనందం దక్కుతుందని అన్నారు. విద్యార్థులను కేంద్రంగా చేసుకుని అనేక సంస్కరణలు చేపట్టామని వివరించారు. 

“గతంలో పాఠ్యపుస్తకాలపై ముఖ్యమంత్రి, మంత్రుల బొమ్మలుండేవి. నాకు ఆ ఫోటో పిచ్చి లేదు. అందుకే బ్యాగ్‌పై, బెల్ట్‌పై, గుడ్డుపై, స్కూలులో ఎక్కడా బొమ్మలు లేకుండా చేశాం. పాఠశాలల్లో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశాం” అని తెలిపారు. 

‘వన్ క్లాస్-వన్ టీచర్’, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్, డొక్కా సీతమ్మ పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేసి భోజన నాణ్యతను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, ‘నో బ్యాగ్ డే’ అమలు చేస్తున్నామని తెలిపారు.

విలువలకే పెద్దపీట
విలువలు లేని సమాజం ప్రమాదకరమని, అందుకే నైతిక విలువల కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించామని లోకేశ్ పేర్కొన్నారు. “అమ్మకు చెప్పలేని పని చేయొద్దు అనే ఆయన మాట చాలా శక్తివంతమైనది. మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలుకావాలి. తల్లికి వందనం వంటి కార్యక్రమాల ద్వారా ఆ మార్పునకు శ్రీకారం చుట్టాం” అని చెప్పారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలు కనడంతో పాటు, రాజకీయాల్లోకి వచ్చి సమాజాన్ని మార్చే నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు.

ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలి
తన రాజకీయ జీవితాన్ని ఉదాహరణగా చూపుతూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. “2019లో ఇదే మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడు బాధ కలిగినా, పట్టుదలతో ఐదేళ్లు పనిచేసి 91 వేల మెజారిటీతో గెలిచాను. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయొద్దు. ఫెయిల్ అంటే ఫస్ట్ ఎటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని గుర్తుంచుకోండి” అని సూచించారు. 

ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేస్తోందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. చదువు పూర్తయ్యాక, అవకాశం వచ్చినప్పుడు సొంత పాఠశాలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారీయా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.





Advertisement
Nara Lokesh
Andhra Pradesh Education
Shining Stars Awards
Government Schools AP
Mega DSC
AP Education Reforms

More Telugu News