ప్రేమకథలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక విలేజ్ నేపథ్యంలోని ప్రేమకథలకు మరింత ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రేమకథగా 'దూరదర్శని' కనిపిస్తుంది. సువిక్షిత్ - గీతికా రతన్ జతగా నటించిన సినిమా ఇది. పబ్లిసిటీ పరంగా పెద్ద హడావిడి చేయకుండానే థియేటర్లకు వచ్చింది. అందువలన థియేటర్లలో నిలబడలేకపోయింది.  మే 15వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, జూన్ 26వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

అది ఒక అందమైన పల్లెటూరు .. దాని పేరు 'మట్టుపర్రు'. అక్కడ హరి (సువిక్షిత్) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఇంటర్ చదివిన హరి, పై చదువులకు పట్నం వెళ్లాలనే ఆశను చంపుకుంటాడు. ఎందుకంటే ఉన్నకొద్ది పొలాన్ని అమ్మేయడం అతనికి ఇష్టం ఉండదు. అందువలన ఊళ్లోని స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. హరి తండ్రి రాజయ్య ఉన్న కొద్దిపాటి పొలాన్ని సేద్యం చేసుకుంటూ, పరశురామ్ దగ్గర పనిచేస్తుంటాడు. 

పరశురామ్ శ్రీమంతుడు .. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊరు మోతుబరి. అతనంటే ఆ ఊళ్లో అందరికి భయమే. అందువల్లనే ఆయన చెల్లెలు వాణి (గీతికా రతన్) వైపు చూసే సాహసం ఎవరూ చేయరు. పట్నంలో చదువుకుంటున్న ఆమె, పరీక్షల తరువాత ఆ ఊరుకు వస్తుంది. అయితే తొలి చూపులోనే వాణిని చూసి హరి మనసు పారేసుకుంటాడు. 'పేకబాబు' ఇంట్లో 'చిత్రలహరి' చూడటానికి వచ్చిన హరి - వాణి ఇద్దరూ ప్రేమలో పడతారు. 

తన ఇంటికి 'చిత్రలహరి' చూడటానికి వస్తున్న వాణిని పేకబాబు కూడా ఇష్టపడతాడు. అయితే ఆమె హరితో సన్నిహిత్యంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతుంటాడు. కులమతాలపైనే పరువు ప్రతిష్ఠలు ఆధారపడి ఉంటాయని బలంగా నమ్మే ఆ ఊళ్లో, తమ ప్రేమ గెలవలేదనే విషయం  ఆ జంటకు అర్థమైపోతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ తరువాత చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.

ప్రేమకి కులమతాలు .. ఆర్థికపరమైన స్థితిగతులు ఎప్పటికీ అడ్డుగోడలేనని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కట్టుబాట్ల కారణంగా, ఈ అంతరాలు మరింత బలంగా కనిపిస్తూ ఉంటాయి.  విలేజ్ నేపథ్యంలో ఒక పేదింటి అబ్బాయి .. కలవారి అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి కథతో చేసిన మరో ప్రయత్నంగా ఈ సినిమా నిలుస్తుంది. హీరోయిన్ అన్నయ్య ఒక మోతుబరి .. ఒక రకంగా విలన్ షేడ్స్ తో భయపెట్టే రకం. ఇక అదే ఊళ్లో మరో డబ్బున్న యువకుడు .. అతను కూడా విలన్ షేడ్స్ ను కలిగినవాడే. హీరోయిన్ పై మనసు పారేసుకున్న ఈ డబ్బున్న దొరబాబు, ఆల్రెడీ హీరోయిన్ మనసు దోచుకున్న హీరోపై ద్వేషంతో ఉంటాడు. ఈ నాలుగు పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

 ఇక హీరోయిన్ ను హీరో కలుసుకునేలా చేయడంలోనే తమ జీవితం ధన్యమైందని భావించే మిత్ర బృందం ఇందులోనూ కనిపిస్తుంది. కాకపోతే ఆ టీమ్ చేసే కామెడీ కాసింతైనా పండలేదు. ప్రధానమైన నాలుగు పాత్రలను బలంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. కానీ ఆ దిశగా అంత కసరత్తు జరగలేదనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన, సన్నివేశాలపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం వలన .. ఆశించినస్థాయి అవుట్ పుట్ లేకుండా తేలిపోతుంటాయి. రొటీన్ గా అనిపిస్తూ నిరాశపరుస్తూ ఉంటాయి.

 1980లలో బాగా డబ్బున్న ఇళ్లలోనే టీవీలు ఉండేవి. అందువలన చుట్టుపక్కల వాళ్లు వెళ్లి అక్కడ కూర్చునేవారు. అలా పేదింటివాడైన హీరో వెళ్లి వేరే ఇంట్లో టీవీ చూశాడంటే అర్థం ఉంది. కానీ మోతుబరి అయిన పరశురామ్ ఇంట్లో టీవీ లేకపోవడం .. అతని చెల్లెలు కూడా వేరే ఇంటికి వెళ్లి టీవీ చూడటం చిత్రంగా అనిపిస్తుంది. కొత్తగా పెళ్లయిన  భద్రం పాత్ర ద్వారా కామెడీని పండించడానికి చేసిన ప్రయత్నం .. కులమతాల అంతరాల కారణంగా శారద బలైపోవడం వంటి ఎమోషనల్ సీన్స్ కూడా పేలవంగా అనిపిస్తాయి.ప్రేమికులు ఒక నిర్ణయం తీసుకునేప్పుడు తమని కన్న వాళ్లను గురించి ఒకసారి ఆలోచన చేయండి అనే సందేశం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కానీ ఆ సందేశం చుట్టూ ఒక ఆసక్తికరమైన కథను అల్లుకోలేకపోయారు.  

మురళీ మోహన్ రెడ్డి ఫోటోగ్రఫీ  .. ఆనంద్ సంగీతం ఫరవాలేదు. అక్కడక్కడా పాటల్లో సాహిత్యం బాగుందనిపిస్తుంది. ' ఇంద్రధనస్సు కట్టినావే కంటి గడపకి .. వరదలేవో తెచ్చినావే గుండె పడవకి' వంటి లైన్స్ మనసుకు పట్టుకుంటాయి. కథాకథనాలు బలహీనమైనవే అయినా, విలేజ్ నేపథ్యంలో దృశ్యాలు మనసుకు హాయిగా అనిపిస్తాయి. పంటపొలాలు .. కొబ్బరి తోటలు .. ఇటుక బట్టీలు .. కాలి బాటలు .. గోదారి ఒడ్డు .. ఈ కథకు అందమైన ఆభరణంలా అనిపిస్తాయని చెప్పాలి. విలేజ్ నేపథ్యంలో లొకేషన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు.