ఖమేనీ అంత్యక్రియలకు మోదీ దూరం.. భారత్‌ తరఫున వెళ్లేది వీరే..!

PM Modi to skip Khamenei funeral India to send representatives
  • జులై 4న ఖమేనీ అంతక్రియలు ప్రారంభం
  • ఆ సమయంలో ఇండోనేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనకు మోదీ
  • ముందే ఖరారైన షెడ్యూల్‌ కారణంగా అంత్యక్రియలకు ప్రధాని దూరం
  • భారత్‌ తరఫున బిహార్‌ గవర్నర్‌, విదేశాంగ శాఖ సహాయ మంత్రి
  • జులై 9న ఖమేనీ ఖననం 
ఇరాన్‌ దివంగత మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకావడం లేదు. ఆయన స్థానంలో బీహార్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా భారత ప్రతినిధులుగా పాల్గొననున్నారు.

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ ఇటీవల ప్రధాని మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపారు. అయితే ఆ సమయంలో ఇండోనేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పర్యటన ఇప్పటికే ఖరారు కావడంతో మోదీ హాజరు కాలేకపోతున్నారు. ఈ షెడ్యూల్‌ ముందుగానే ఖరారైందని అధికార వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. తొలుత మార్చిలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. కానీ ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు జులైలో పలువురు దేశాధినేతలు, ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

జులై 4న టెహ్రాన్‌లోని గ్రాండ్‌ మొసల్లా సముదాయంలో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. చివరి అంత్యక్రియలు జులై 9న ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లోని ఇమామ్‌ రెజా దర్గా వద్ద జరగనున్నాయి.
Ayatollah Ali Khamenei
Narendra Modi
Iran Supreme Leader funeral
Syed Ata Hasnain
Pabitra Margherita
India Iran relations

More Telugu News