USTR: పీఓకే భారత్‌దే... ఈ మ్యాప్‌తో అమెరికా క్లారిటీ ఇచ్చిందా?

PoK Included in India Map Removed by USTR Sparks Controversy
షార్ట్స్‌లో చూడండి
భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) భారత పూర్తి మ్యాప్‌ను ప్రచురించి, వివాదం రేగడంతో కొద్ది గంటల్లోనే దాన్ని తొలగించింది. ఈ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), చైనా ఆక్రమిత అక్సాయిచిన్‌లను కూడా భారత భూభాగంలో అంతర్భాగంగా, ఎలాంటి వివాదాస్పద రేఖలు లేకుండా చూపించడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే, ఫిబ్రవరి 7వ తేదీన భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటిస్తూ USTR తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్ట్ చేసింది. సాధారణంగా అమెరికా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక మ్యాప్‌లలో వివాదాస్పద ప్రాంతాలను ప్రత్యేక గీతలతో సూచిస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా, భారత అధికారిక వైఖరికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా పూర్తి కశ్మీర్‌ను భారత మ్యాప్ లో చూపించింది. దీంతో అమెరికా విధానంలో కీలక మార్పు వచ్చిందని, భారత్‌కు ఇది దౌత్యపరమైన విజయమని చాలామంది భావించారు.

అమెరికా-పాకిస్థాన్, అమెరికా-చైనా సంబంధాలు ఒత్తిడిలో ఉన్న ప్రస్తుత తరుణంలో, ఇది భారత్‌కు మద్దతుగా అగ్రరాజ్యం పంపిన పరోక్ష సంకేతమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, మరికొందరు దీనిని కేవలం ఒక సాంకేతిక తప్పిదంగానే పరిగణించారు. భారతదేశం ఎప్పటినుంచో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు తమ అవిభాజ్య భూభాగాలని, పీఓకే, అక్సాయిచిన్ కూడా తమ భూభాగమేనని స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా పోస్ట్ తొలుత భారత్ వాదనకు బలం చేకూర్చేలా కనిపించింది.

అయితే, ఈ మ్యాప్‌పై సోషల్ మీడియాలో, దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైన వెంటనే USTR ఆ పోస్ట్‌ను తొలగించింది. పాకిస్థాన్ నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వివాదంపై USTR ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఇతర ప్రెస్ రిలీజ్‌లు వెబ్‌సైట్‌లో యథాతథంగానే ఉన్నాయి. ఒక సాధారణ వాణిజ్య ప్రకటనలో చోటుచేసుకున్న ఈ మ్యాప్ వివాదం, భారత్-అమెరికా సంబంధాలలోని భౌగోళిక, రాజకీయ సున్నితత్వాన్ని మరోసారి ప్రపంచం దృష్టికి తెచ్చింది.
Go Back to Shorts
USTR
India US trade deal
Pakistan occupied Kashmir
PoK India
Aksai Chin
India America relations
US map controversy
India China border
Jammu Kashmir
Ladakh

More Telugu News