Monalisa: పాఠశాల ప్రారంభిస్తున్న కుంభమేళా బ్యూటీ!

Monalisa to Start School with First Movie Remuneration
షార్ట్స్‌లో చూడండి
తన మొదటి సినిమా రెమ్యునరేషన్‌తో పాఠశాల ప్రారంభిస్తానని కుంభమేళా బ్యూటీగా పాప్యులర్ అయిన మోనాలిసా ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన మోనాలిసా ఇప్పుడు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సాధారణ జీవితం నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం వెండితెర వరకు చేరుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహాకుంభ్‌లో వైరల్ అయిన తర్వాత వచ్చిన అవకాశాలతో మోనాలిసా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమె తొలి హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై భావోద్వేగానికి గురైంది. సినీ ప్రపంచంతో పాటు, తన పాత జీవితాన్ని కూడా సమానంగా ప్రేమిస్తున్నానని మోనాలిసా వెల్లడించింది.
 
ఇక తాజాగా ఆమె మళ్లీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి గంగా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపింది. మహా కుంభమేళాలో దండలు అమ్ముతున్న రోజుల్లో తాను ఇంత దూరం వస్తానని కలలో కూడా ఊహించలేదని చెప్పింది. తన జీవితాన్ని మార్చిన ఈ అవకాశాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తన మొదటి సినిమా నుంచి అందే రెమ్యునరేషన్‌తో మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలన్నదే తన కల అని మోనాలిసా తెలిపింది. ఆ ప్రాంతాల్లో అమ్మాయిలకు సరైన విద్యావకాశాలు లేవని, చదువుకోని బాలికలు జీవితంలో వెనుకబడిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
 
బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, అందుకే తన సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మోనాలిసా మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో రెండు తెలుగు సినిమాలు కాగా, మరోటి హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్. 
Go Back to Shorts
Monalisa
Kumambh Mela
Prayagraj
Bollywood
School for Girls
Education
Khargon
The Diary of Manipur
Telugu movies

More Telugu News