ఒక ఫోన్ ను సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చి రెండో ఫోన్ ను స్పాట్ కు తీసుకెళుతున్నారు: నాని
- మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబీ29
- 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' విజువల్స్ లీక్‌పై హీరో నాని స్పందన
- ఎంత రహస్యంగా చిత్రీకరించినా లీకులు జరుగుతున్నాయని వ్యాఖ్య
- షూటింగ్ స్పాట్‌లలో నిబంధనలు మీరి ఫోన్లు తీసుకెళ్తున్నారని ప్రస్తావన
రాజమౌళి వంటి అగ్ర దర్శకుడి సినిమా అంటే నిర్మాణ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయని నాని గుర్తుచేశారు. "వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, వందల మంది సాంకేతిక నిపుణులు ప్రతి విభాగంలోనూ పనిచేస్తుంటారు. సాధారణంగా షూటింగ్ ప్రదేశాలకు సెల్‌ఫోన్లు అనుమతించరు. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు నిబంధనలను అతిక్రమిస్తుంటారు. కొందరు చిత్రబృందం కళ్లుగప్పి ఫోన్ లోపలికి తీసుకెళుతుంటారు. ఒక ఫోన్‌ను సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చి, రెండో ఫోన్‌ను ఎవరికీ తెలియకుండా స్పాట్‌కు తీసుకెళుతున్నారు. రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు" అని నాని వివరించారు.
లీక్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అడ్డదారులు వెతుకుతారని, దీనిని పూర్తిగా నిరోధించడం సవాలుగా మారుతోందని నాని అన్నారు. "లీక్ చేయాలని భావించినప్పుడు ఎన్నో అడ్డదారులు ఉంటాయి. దీని గురించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి ఎంతో రహస్యంగా సినిమాను చిత్రీకరించాలని ప్రయత్నించినప్పటికీ కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. మనం కచ్చితంగా వీటికి అడ్డుకట్ట వేయాలి. ఇలాంటివి జరగకుండా ఎదుర్కోవాలి" అని నాని స్పష్టం చేశారు.
ఇటీవల ఒడిశా షెడ్యూల్‌లో మహేశ్ బాబుపై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై చిత్రబృందం తక్షణమే స్పందించి, ఆయా వీడియోలు, ఫోటోలను తొలగించేందుకు చర్యలు చేపట్టింది.