బలమైన కథలను .. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ విక్రాంత్ మస్సే తన కెరియర్ లో ముందుకు వెళుతున్నాడు. ఆయన నుంచి ఒక సిరీస్ గానీ .. సినిమాగాని వస్తుందంటే, ఆ కంటెంట్ లో ఏదో విశేషం ఉండే ఉంటుందనే ఒక నమ్మకం ఆడియన్స్ కి ఏర్పడిపోయింది. అలాంటి ఆయన కథానాయకుడిగా రూపొందిన తాజా సిరీస్ 'ముసాఫిర్ కేఫ్'. రుచిర్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా నిర్మితమైంది. 'నెట్ ఫ్లిక్స్'లో హిందీతో పాటు ఇతర భాషల్లో ఈ నెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.

చంద్రమోహన్ శర్మ ( విక్రాంత్ మస్సే) ను అందరూ 'చందర్' అని పిలుస్తూ ఉంటారు. అతను మధ్యప్రదేశ్ లో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు 'ఢిల్లీ'లో ఉంటూ ఉంటారు.
ఆ సమయంలో అతను పెళ్లి విషయంగా 'సుధ' (వేదిక పింటో)ను కలుస్తాడు. ఆమె ఓ లాయర్. ఆమె ఆలోచనలు .. అభిప్రాయాలు అర్థమైన తరువాత, తనకీ ..  ఆమెకి సెట్ కాదని ఇంట్లో వాళ్లకి చెబుతాడు. అయితే అతను 'భోపాల్'కి వచ్చిన తరువాత మళ్లీ ఆమె తారసపడుతుంది. ఆ తరువాత వాళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది. 

'సుధ' తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోతుంది. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ తల్లి ఆమెను పెంచుతుంది. అందువలన తాను 'ముంబై'లో లాయర్ గా స్థిరపడాలనీ, డబ్బు బాగా సంపాదించాలనేది ఆమె ఆశయం. తన తల్లిని సంతోషంగా చూసుకోవాలనేది ఆమె కోరిక. అది నెరవేరేవరకూ పెళ్లి చేసుకోకూడదనేది ఆమె నిర్ణయం. అదే విషయాన్ని ఆమె చందర్ తో చెబుతుంది. సుధ తన మకామ్ ను చందర్ ఫ్లాట్ కి మార్చడంతో, ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెడతారు.

 మొదటి నుంచి కూడా చందర్ కి ప్రకృతి అంటే ఇష్టం. ఆ తరువాత అతను ఎక్కువగా ఇష్టపడేది కాఫీ. తనదైన పద్ధతిలో కాఫీ తయారు చేయడంలో ఆయనకి మంచి నైపుణ్యం ఉంటుంది. కొండల ప్రాంతంలో ఒక కేఫ్ పెట్టాలనీ .. అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనేది అతని కల. అలాంటి ఆ జంట మధ్యలోకి 'ప్రీతి' వస్తుంది. ప్రీతి ఎవరు? ముంబైలో స్థిరపడాలనే సుధ కోరిక నెరవేరుతుందా? కొండ ప్రాంతంలో కేఫ్ పెట్టాలనే చందర్ కల నిజమవుతుందా? వాళ్లిద్దరి పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ.

జీవితమన్నాక ఆశయమంటూ ఒకటి ఉండాలి. ఎలాంటి అవాంతరాలు .. అడ్డంకులు ఎదురైనా ఆశయసాధన దిశగా సాగిపోవాలని కొంతమంది భావిస్తారు. తాము అనుకున్నది సాధించడానికి ప్రేమ - పెళ్లి అనేవి అడ్డుగా మారతాయని ఆలోచన చేస్తారు. అవతలివారి ఎమోషన్స్ తో పని లేకుండా, తమకి తోచిన నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంటారు. అలా ప్రేమకి .. పెళ్లికి దూరంగా వెళ్లిన ఒక యువతి, చివరికి ఎలాంటి అభిప్రాయానికి వచ్చిందనే కథ ఇది.

సుధ - చందర్ కి సంబంధించిన గతం, ప్రీతి - చందర్ కి సంబంధించిన వర్తమానాన్ని సమాంతరంగా చూపిస్తూ వెళుతూ దర్శకుడు ఈ కథపై ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాడు. సుధ- చందర్ మధ్య లవ్ - రొమాన్స్ సన్నివేశాలను చూస్తున్న ప్రేక్షకులు, వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయి ఉంటారు? అనే కుతూహలంతో వెయిట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ప్రీతి ఎలా అతని జీవితంలోకి ప్రవేశించి ఉంటుందనేది తెలుసుకోవాలనే ఆసక్తితో కథను ఫాలో అవుతూ ఉంటారు. 

'కల'ను నిజం చేసుకోవడంలోనే జీవితానికో అర్థం ఉంటుంది అనేది సుధ కాన్సెప్ట్. 'నా కల - నిజం రెండూ నువ్వే' అనేది చందర్ మాట. ఈ రెండు మనసుల మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. లవ్ .. రొమాన్స్ పాళ్లు కలిసినప్పటికీ, మొదటి మూడు ఎపిసోడ్స్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. నాలుగో ఎపిసోడ్ నుంచి మాత్రం కథ పుంజుకుంటుంది. ఫీల్ తో కూడిన ఎమోషన్స్ మనసును పట్టుకుంటూ ఉంటాయి. 

ప్రధానంగా ఈ కథ సుధ.. చందర్ .. ప్రీతి అనే మూడు పాత్రలతో సాగుతుంది. ఇక సందర్భాన్ని బట్టి మిగతా పాత్రలు వచ్చి వెళుతూ ఉంటాయి. ఈ మూడు పాత్రలను మలచిన తీరులోనే దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేశాడు. లవ్ .. రొమాన్స్ .. సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించడంలో తన పనితనం చూపించాడు. ముఖ్యంగా ఈ కథకు అవసరమైన ఫీల్ ను వర్కౌట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 

విక్రాంత్ మస్సే మంచి నటుడే అయినప్పటికీ, ఈ సిరీస్ దగ్గరికి వచ్చేసరికి వేదిక పింటో నటన హైలైట్ గా నిలుస్తుంది. అక్కడక్కడా 'త్రిష'ను గుర్తుచేస్తూ .. ఆ పాత్రలో ఆమె పూర్తిగా ఒదిగిపోయింది. తన చలాకీ తనంతో ఆట్టుకుంటుంది. రుచిర్ అరుణ్ కథ - స్క్రీన్ ప్లే ..  అనిరుద్ధ చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. నీల్ అధికారి నేపథ్య సంగీతం బాగుంది. యశ జైదేవ్ ఎడిటింగ్ మెప్పిస్తుంది. బలమైన .. బరువైన కథాకథనాలతో కూడిన ఈ సిరీస్ మనసుకు హత్తుకుంటుంది. వేదిక పింటో నటన ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పచ్చు.