అతివలు లేకుండా టీవీ సీరియళ్లు.... తాలిబన్ల హుకుం
- ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన
- పాత రోజులను గుర్తుకుతెస్తున్న తాలిబన్లు
- కొత్త నిషేధాజ్ఞలు విధించిన వైనం
- పురుషులు సైతం నిండుగా దుస్తులు ధరించాలని ఆదేశం
అమెరికా బలగాలు ఆఫ్ఘన్ గడ్డపై నుంచి నిష్క్రమించాక తాలిబన్లు పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా తమ నిజస్వరూపాన్ని చాటుకుంటున్నారు. మహిళలు టీవీ సీరియళ్లలో నటించడంపైనే కాదు, సినిమాల్లో కనిపించడంపైనా తాజాగా నిషేధం విధించారు.
మహిళలు వినోద వస్తువుల్లా బహిరంగ వేదికలపై కనిపించడం ఇస్లామిక్ షరియా చట్టానికి విరుద్ధమని తాలిబన్లు భావిస్తున్నారు. అంతేకాకుండా, టీవీల్లో కనిపించే పురుషులు సైతం నిండుగా దుస్తులు ధరించాలని, కామెడీ, ఇతర వినోద కార్యక్రమాలు మతాన్ని కించపర్చేవిగా ఉండరాదని స్పష్టం చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రచారం చేసే విదేశీ చిత్రాలను ప్రసారం చేయరాదని ఆదేశించారు.