సుధాకర్ లాగానే నన్నూ వేధిస్తున్నారు... పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వాపోయిన డాక్టర్ అనితారాణి!
- మెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా అనితారాణి
- కింది స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు వేధింపులు
- పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన
కింది స్థాయి సిబ్బంది పాల్పడుతున్న అవినీతిని ప్రశ్నించడమే తన తప్పయిపోయిందని, తనపై కక్ష కట్టిన స్థానిక అధికార పార్టీ నేతలు, జనతా కర్ఫ్యూ రోజున తనను ఓ గదిలో బంధించి, రకరకాలుగా వేధించి, దుర్భాషలాడారని, తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. వాష్ రూములో తన ఫొటోలు, వీడియోలు తీసి మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు.
తాను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, ఫిర్యాదు తీసుకోకుండా దాదాపు 11 గంటల పాటు కూర్చోబెట్టారని, ఉన్నతాధికారులతో ఫోన్ చేయించి కేసు పెట్టవద్దని బెదిరింపులకు దిగారని ఆమె తెలిపారు. తనను ఆదుకోవాలని కోరుతూ, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఆమె చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోపక్క, ఈ విషయంపై తాను హైకోర్టుకు కూడా వెళ్లినట్టు ఆమె తెలిపారు.