భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విషయంలో టీమిండియా యాజమాన్యం, సీనియర్ ఆటగాళ్లు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. సోషల్ మీడియా, బయటి ప్రపంచం మాటలు లాంటి అనవసర విషయాల వైపు దృష్టి మళ్లకుండా, కేవలం ఆటపైనే ఏకాగ్రత పెట్టేలా అతడిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ స్వయంగా వెల్లడించాడు.

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ఇషాన్ కిషన్ మాట్లాడాడు. వైభవ్ కెరీర్‌కు సంబంధించి జట్టు ఎలాంటి సలహాలు ఇస్తుందని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. "వైభవ్ చాలా తెలివైన కుర్రాడు. మైదానంలో, బయట ఎలా ఉండాలో అతనికి తెలుసు. కానీ, అతను వచ్చిన నేపథ్యం దృష్ట్యా అనేక పరధ్యానాలకు లోనయ్యే అవకాశం ఉంది. స్నేహితుల సర్కిల్‌లోనూ ఇలాంటివి ఎదురవుతాయి. నేను కూడా అలాంటి నేపథ్యం నుంచే వచ్చాను కాబట్టి, భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దేనిపై దృష్టి పెట్టాలో నాకు బాగా తెలుసు" అని ఇషాన్ వివరించాడు.

"నేను మాత్రమే కాదు. అభిషేక్ శర్మ, అక్షర్ భాయ్ సహా జట్టులోని చాలా మంది సీనియర్లు వైభవ్‌తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది, బయట జనం ఏమనుకుంటున్నారు అనే విషయాల గురించి ఆలోచించకుండా, కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టేలా చూసుకుంటాం. పరుగులు చేయనప్పుడు బాడీ లాంగ్వేజ్ పడిపోకుండా ప్రోత్సహిస్తాం" అని ఇషాన్ తెలిపాడు.

వైభవ్ అరుదైన ప్రతిభావంతుడని, అతని లాంటి ఆటగాడు క్రీజులో ఉంటే పవర్‌ప్లేలోనే 80-90 పరుగులు చేయగలడని ఇషాన్ ప్రశంసించాడు. "అంతటి ప్రతిభ ఉన్న యంగ్ ప్లేయర్ తప్పుడు కారణాల వల్ల దారి తప్పకూడదని మేము కోరుకుంటున్నాం. అతను, నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. కాబట్టి ఒక అన్నయ్యగా అతడిని సంతోషంగా ఉంచడం, ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టేలా చేయడం మా బాధ్యత. మా కెరీర్ తొలినాళ్లలో మేము చేసిన పొరపాట్లను, ముఖ్యంగా మానసిక దృక్పథం, ఫిట్‌నెస్ విషయాల్లో చేసిన తప్పులను అతను పునరావృతం చేయకుండా చూసుకుంటాం. అతను తన క్రికెట్‌ను ఆస్వాదించాలన్నదే మా లక్ష్యం" అని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.