కూటమి పాలనకు రెండేళ్లు: రేపటి నుంచి టీడీపీ ఇంటింటి ప్రచారం... నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.

Chandrababu Naidu teleconference as TDP starts door to door campaign for two years of coalition rule
  • రెండేళ్ల కూటమి పాలనపై రేపటి నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ ప్రచారం
  • ప్రభుత్వ విజయాలను, హామీల అమలును ప్రజలకు వివరించాలని నేతలకు చంద్రబాబు ఆదేశం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచన
  • అనుచరులుగా కాదు, నాయకులుగా ఎదగాలని పార్టీ శ్రేణులకు పిలుపు
  • గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (సోమవారం) 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 'డోర్ టు డోర్' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ బృహత్ కార్యక్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి బూత్ స్థాయి కన్వీనర్ల వరకు పార్టీ యంత్రాంగం మొత్తం ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని గుర్తుచేశారు. "94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో మనం గెలిచాం. నాటి ప్రభుత్వ విధ్వంసం, ఘోర తప్పిదాల వల్లే 151 సీట్ల పార్టీ 11 సీట్లకు పడిపోయింది" అని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల పోరాటాలు, ఎన్నికల వ్యూహాల వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. "ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎలాగైతే ప్రతి ఇంటికీ వెళ్లారో, ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్లి మనం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నామో చెప్పాలి. ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి" అని సూచించారు.

నాకు కావాల్సింది అనుచరులు కాదు!

పార్టీలో నాయకత్వ పటిమను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు నొక్కిచెప్పారు. "నాకు కావాల్సింది అనుచరులు కాదు, పార్టీకి నాయకులు కావాలి. సమస్యలకు పరిష్కారం చూపే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలతో సన్నిహితంగా మెలగాలి" అని ఆయన హితవు పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు.

గొడ్డలి పార్టీవిధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని చంద్రబాబు కోరారు. "ఘోర ఓటమి చవిచూసినా ఆ పార్టీ ఇప్పటికీ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. వారి విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. యువతను వారు ఏ విధంగా నిర్వీర్యం చేశారో, యువత భవిత కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి" అని ఆయన అన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమైతేనే ప్రతిపక్ష కుట్రలను ఎండగట్టగలమని స్పష్టం చేశారు. 

"మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం, కానీ ఏమరుపాటు వద్దు. రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ వివరించాలి" అని ఉద్ఘాటించారు. ప్రజల్లో ఉండటాన్ని ప్రతి నాయకుడు బాధ్యతగా స్వీకరించాలని కర్తవ్య బోధ చేశారు.


Advertisement
Chandrababu Naidu
TDP Door to Door Campaign
Andhra Pradesh Coalition Government
Telugu Desam Party Outreach
AP Local Body Elections
Andhra Pradesh Politics

More Telugu News