మన యువశక్తిని చూసి గర్వపడుతున్నా: 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ

Narendra Modi proud of youth power in Mann Ki Baat 136th episode
  • దేశ యువశక్తిపై గర్వంగా ఉందన్న ప్రధాని మోదీ
  • 'మన్ కీ బాత్'లో యువత సాధించిన విజయాల ప్రస్తావన
  • 'విక్రమ్-1' ప్రయోగంతో అంతరిక్ష రంగంలో నవశకం
  • సైన్స్ ఒలింపియాడ్స్‌లో స్వర్ణ పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 136వ ఎపిసోడ్‌లో దేశ యువత సాధిస్తున్న విజయాలపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతరిక్షం నుంచి సైన్స్ ఒలింపియాడ్స్ వరకు వివిధ రంగాల్లో యువత అద్భుత ప్రతిభ కనబరుస్తోందని, దేశ యువశక్తిని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు.

 ఇటీవ‌ల‌ విజయవంతమైన 'విక్రమ్-1' ప్రయోగం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపిందని మోదీ పేర్కొన్నారు. ఇది వికసిత భారత్ లక్ష్యంలో ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్ అని, భారత అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఒకప్పుడు ఊహించలేనిదాన్ని మన యువ ఆవిష్కర్తలు సుసాధ్యం చేశారని, వారిలో అసాధారణ నైపుణ్యం, పట్టుదల ఉన్నాయని కొనియాడారు. చాలాకాలంగా ప్రైవేటు రంగానికి దూరంగా ఉన్న అంతరిక్ష రంగాన్ని యువత ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తెరిచామని, దాని ఫలితాలను నేడు ప్రపంచం చూస్తోందని వివరించారు.

అంతరిక్ష రంగంలోనే కాకుండా, సైన్స్ రంగంలోనూ మన యువత దేశానికి గర్వకారణంగా నిలుస్తోందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సైన్స్ ఒలింపియాడ్స్‌లో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారని చెప్పారు. ఈ నెలలో జరిగిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్‌లో మన విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఫిజిక్స్ ఒలింపియాడ్స్‌లో మన ఐదుగురు విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించారని, దీంతో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

గత పదేళ్లుగా ఫిజిక్స్ ఒలింపియాడ్స్‌లో భారత విద్యార్థులు స్వర్ణ లేదా రజత పతకాలు సాధిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు. కెమిస్ట్రీ ఒలింపియాడ్స్‌లో పాల్గొన్న విద్యార్థులందరూ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారని, ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన అని పేర్కొన్నారు. అలాగే, బయాలజీ ఒలింపియాడ్స్‌లో స్వర్ణంతో సహా పలు పతకాలు, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్‌లో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు సాధించారని వివరించారు. దేశ యువశక్తిని చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. భవిష్యత్తులో మరింత మంది యువత ఇలాంటి ఒలింపియాడ్స్, హ్యాకథాన్లలో పాల్గొని దేశానికి గర్వకారణంగా నిలుస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Advertisement
Narendra Modi
Mann Ki Baat 136th Episode
Indian Youth Achievements
Vikram 1 Rocket Launch
International Science Olympiads
Viksit Bharat Space Sector

More Telugu News