విజయవాడ - హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి
- కారును వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
- చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- నల్గొండ జిల్లా చిట్యాల మండలం వద్ద ఘటన
- ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ప్రమాదంలో మృతి చెందిన వారంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.