వారం రోజుల జిల్లా పర్యటనల తర్వాత రేపు అమరావతికి సీఎం చంద్రబాబు
- నాలుగు జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
- హీరో, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలతో వేల కోట్ల పెట్టుబడులకు అంకురార్పణ
- కుప్పంలో 3 రోజుల పాటు 30కి పైగా ప్రాజెక్టుల ప్రారంభం
- సోమవారం నుంచి ఆర్టీజీఎస్, ఇతర సమీక్షలతో సీఎం బిజీ
ఈ నెల 1న అమరావతి నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు జిల్లా గూడూరులో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొని, పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో మెగా ఫర్నిచర్ పార్కు ఏర్పాటు చేయనున్నామని, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
మరుసటి రోజు, జూలై 2న, తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకం 'వీబీ జీ రామ్ జీ'ని జాతీయ స్థాయిలో ప్రారంభించారు. అనంతరం తిరుపతిలో 'ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్' వర్క్‌షాప్‌లో పాల్గొని, డేటా ఆధారిత పాలన ప్రాముఖ్యతను వివరించారు.
జూలై 3న, రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.16,350 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంటుతో పాటు, అనుబంధంగా ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులనూ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.
అనంతరం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు. 'స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక' కార్యక్రమంలో భాగంగా రూ.9,322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో ప్రఖ్యాత అడిడాస్ ఫుట్‌వేర్ సంస్థ నుంచి విమానాల తయారీ ప్రాజెక్టు వరకు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 40,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. కుప్పంలో రూ.118 కోట్లతో మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, ఆరు దశాబ్దాల కంగుంది భూ సమస్యను పరిష్కరించి రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. చివరి రోజు పౌల్ట్రీ, అభ్యుదయ రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
ఆదివారం రాత్రి కుప్పంలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి, సోమవారం ఉదయం నేరుగా సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికపై ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.