పసిడికి ‘పన్ను’ సెగ.. భారత్‌లో భారీగా తగ్గిన బంగారం డిమాండ్!
- కేంద్రం నిర్ణయంతో బంగారం కొనుగోళ్లు డౌన్
- పసిడిపై పన్ను భారం భారీగా పెంపు
- నిత్యవసరాల ధరల పెరుగుదల వల్ల నష్టం
- లైట్‌వెయిట్ నగల వైపు కస్టమర్ల మొగ్గు
- పాత బంగారం అమ్మేందుకు జనం క్యూ
పన్నుల భారం
బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచింది. దీనికి జీఎస్‌టీ కూడా చేరడంతో పసిడిపై పడే మొత్తం పన్ను భారం 9.18 శాతం నుంచి 18.45 శాతానికి చేరింది. రూపాయి విలువ పతనం కావడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
వెలవెలబోతున్న జువెలరీ షాపులు
పన్నుల పెంపు దెబ్బకు దేశవ్యాప్తంగా పసిడి కొనుగోళ్లు భారీగా పడిపోయాయని ‘ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్’ వెల్లడించింది. గతేడాది మే నెల చివరి రెండు వారాల్లో 25 టన్నులుగా ఉన్న బంగారం డిమాండ్ ఈసారి కేవలం 7.5 టన్నులకే పరిమితమైంది. దేశీయ బంగారం వ్యాపారంలో 65 శాతం వాటా ఉన్న అసంఘటిత రంగం ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితమైంది.
మోదీ పిలుపు
ఈ ఏడాది బంగారానికి దూరంగా ఉండాలంటూ ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తి కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనితో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నాయి. ప్రస్తుతం ముంబై స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1.57 లక్షలు పలుకుతుండటం గమనార్హం.
లైట్‌వెయిట్ నగలకు క్రేజ్
బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా తక్కువ క్యారెట్ ఉన్న లైట్‌వెయిట్ నగల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకొని చేతిలో డబ్బుల కోసం తమ పాత నగలను అమ్మి క్యాష్ చేసుకునేందుకు జనం జువెలరీ షాపుల వద్ద క్యూ కడుతున్నారు.