బీఆర్ఎస్‌ను తేలుతో పోల్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

Ramchander Rao Compares BRS to Scorpion Calls to Defeat Party
  • ఆ పార్టీని చెప్పుతో కొట్టి చంపాలని ప్రజలకు పిలుపు
  • రైతులను ఆదుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శ
  • గోదావరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎంకు బహిరంగ లేఖ
బీఆర్ఎస్ పార్టీ విధానాలు వెనక నుంచి కాటు వేసే తేలు లాంటివని, అలాంటి పార్టీని చెప్పుతో కొట్టి చంపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసిందని, ఆ పార్టీ కేవలం కొన్ని మీడియా, సోషల్ మీడియాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. 

'సారు.. కారు.. 16' అని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని రాంచందర్‌రావు విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ వద్దకు వంద సార్లు వెళ్లి నిధులు తెచ్చుకుంటూ, బయట మాత్రం కేంద్రం సహకరించడం లేదని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించి ప్రజలతో తిరస్కారానికి గురయ్యారని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని రాంచందర్‌రావు మండిపడ్డారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో పూర్తిగా విఫలమైందని, కనీసం గోనె సంచులు, లారీలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు పడితే, కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

ఇదే సమయంలో, గోదావరి బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి రాంచందర్‌రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై ఎన్‌డీఎస్‌ఏ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Ramchander Rao
BRS party
BJP Telangana
Revanth Reddy
Telangana politics
KCR
Godavari basin projects
Kaleshwaram project
Farmers issues Telangana
Telangana elections

More Telugu News