బండి సంజయ్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోస్టర్లు... స్పందించిన బీజేపీ చీఫ్

Bandi Sanjay Targeted by BRS Posters BJP Chief Responds
  • బండి సంజయ్ ఎలాంటి తప్పుచేయలేదన్న రామచందర్ రావు
  • బండి సంజయ్, బీజేపీపై రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శ
  • వ్యక్తిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం సరికాదన్న రామచందర్ రావు
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఎలాంటి తప్పుచేయలేదని, కానీ ఆయనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. బండి సంజయ్, బీజేపీపై రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

బండి సంజయ్‌ పైనా, బీజేపీపైనా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బీఆర్ఎస్ రాష్ట్రమంతా పోస్టర్లు వేయించిందని విమర్శించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కానీ బండి సంజయ్‌ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడమేమిటని ప్రశ్నించారు. బండి సంజయ్‌ని కేటీఆర్ లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో మహిళలపై నేరాలు 67 శాతం పెరిగాయని ఆరోపించారు. మహిళలపై జరిగిన అత్యాచారానికి సంబంధించి కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ బాలిక కేసులో లేదా మద్యం కేసులో మహిళ జైలుకు వెళ్ళినప్పుడు లేదా తనను ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్ ఫిర్యాదు చేసినప్పుడు వారు రాజీనామా చేశారా అని నిలదీశారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ-కార్ రేసులో కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిశాయి కాబట్టే వారిని అరెస్టు చేయడం లేదని ఆరోపించారు.
Go Back to Shorts
Bandi Sanjay
BRS
BJP
Telangana politics
Ramachander Rao
KTR
Kaleshwaram Project
Telangana crimes against women

More Telugu News