నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక

Vinesh Phogat Warns Government Responsibility for Any Incident
  • గొండాలో జరిగే టోర్నీలో తన భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన
  • నాకు, నా బృందానికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిక
  • బ్రిజ్ భూషణ్ ఆధ్వర్యంలో టోర్నీలో రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపణ
  • లైంగిక వేధింపుల కేసులో బాధితుల్లో తానూ ఒకరినని తొలిసారి వెల్లడి
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కంచుకోట అయిన గొండాలో జరగబోయే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ పై ఏస్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో తనకు గానీ, తన బృందానికి గానీ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే.. దానికి కేంద్ర ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసిన వినేశ్ ఫోగాట్, మే 12 నుంచి 14 వరకు గొండాలో జరగనున్న టోర్నమెంట్‌లో తాను పాల్గొననున్నట్టు తెలిపింది. "బ్రిజ్ భూషణ్, ఆయన మనుషుల నియంత్రణలో జరిగే ఈ టోర్నీలో కష్టపడి ఆడే అథ్లెట్లకు న్యాయం జరగడం అసాధ్యం. ఎవరి మ్యాచ్‌కు ఎవరు రిఫరీగా ఉంటారు, ఎవరికి ఎన్ని పాయింట్లు వేస్తారు అనేదంతా వాళ్లే నిర్ణయిస్తారు" అని ఆమె ఆరోపించింది. క్రీడాకారుల వెయిట్ చెకింగ్ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరగదనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది.

ఇదే వీడియోలో, బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కోర్టులో ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తానూ ఒకరినని వినేశ్ తొలిసారిగా వెల్లడించింది. "లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మేము మూడేళ్ల క్రితమే గళమెత్తాం. కేసు విచారణలో ఉన్నందున ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ ఫిర్యాదు చేసిన ఆ ఆరుగురిలో నేనూ ఒక బాధితురాలిని" అని ఆమె స్పష్టం చేసింద.

బ్రిజ్ భూషణ్‌ను అధికారికంగా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించినప్పటికీ, ఫెడరేషన్‌పై తనకే పట్టుందని ఆయన బహిరంగంగా చెబుతున్నా క్రీడా మంత్రిత్వ శాఖ ప్రేక్షకపాత్ర వహిస్తోందని వినేశ్ ఫోగాట్ విమర్శించారు.


Go Back to Shorts
Vinesh Phogat
Brij Bhushan Sharan Singh
Wrestling Federation of India
National Open Ranking Tournament
Gonda
sexual harassment allegations
Indian wrestler
sports ministry
wrestlers protest
WFI

More Telugu News