ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches Modern Vehicles for AP Fire Department
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శాఖ ఆధునికీకరణలో భాగంగా మొత్తం రూ.252.93 కోట్లతో చేపట్టిన ప్రణాళికలో తొలి దశగా, రూ.33.25 కోట్ల విలువైన నూతన వాహనాలు, అత్యాధునిక పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జెండా ఊపి కొత్త వాహనాలను సేవలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా అధికారులు కొనుగోలు చేసిన పరికరాలు, వాహనాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. తొలి విడతలో భాగంగా రూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 అత్యవసర రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను ప్రభుత్వం సమకూర్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించుకుని ఈ పరికరాలను అందుబాటులోకి తెచ్చిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. రాజధానితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాల (హై-రైజ్ బిల్డింగ్‌లు) నిర్మాణం పెరుగుతున్నందున, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. గతంలో అగ్నిమాపక విభాగంలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేదని, మళ్లీ అదే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సైతం సహాయం చేసిన ఘనమైన చరిత్ర మనకు ఉందని గుర్తుచేశారు.

అన్ని సవాళ్లను అధిగమించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమర్ధంగా సద్వినియోగం చేసుకుని అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh Fire Department
AP Fire Services
Modern Fire Vehicles
Fire Safety Equipment
Disaster Management AP
Amaravati
Home Minister Anita
PV Ramana
Kumar Vishwajeet

More Telugu News