Iran Oil Tanker: భారత్‌కు రావాల్సిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Iran Oil Tanker Diverted to China Not Intended for India Clarifies Government
షార్ట్స్‌లో చూడండి
భారత్‌కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు నౌక ఒకటి చెల్లింపుల సమస్యల కారణంగా చైనాకు మళ్లిందంటూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేలా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఇవాళ‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

"భారత్‌లోని వాడినార్‌కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు నౌక 'చెల్లింపు సమస్యల' కారణంగా చైనాకు మళ్లిందనే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు వాస్తవ విరుద్ధం" అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారత్ 40కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని, వాణిజ్యపరమైన అవసరాలను బట్టి ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసే పూర్తి స్వేచ్ఛ భారత కంపెనీలకు ఉందని వివరించింది.

అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న 'పింగ్ షున్' అనే ఇరాన్ నౌక గుజరాత్‌లోని వాడినార్‌కు బదులుగా చైనాలోని డాంగింగ్‌కు వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ డేటాలో కనిపించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. చెల్లింపు నిబంధనలు కఠినతరం కావడం వల్లే ఈ మళ్లింపు జరిగి ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ వాదనలను కేంద్రం తోసిపుచ్చింది. చమురు వాణిజ్యం ఎలా పనిచేస్తుందో విస్మరించి ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. "బిల్స్ ఆఫ్ లాడింగ్ (రవాణా పత్రాలు)లో కొన్నిసార్లు సూచనాప్రాయంగా మాత్రమే గమ్యస్థానాలను పేర్కొంటారు. వాణిజ్యపరమైన ప్రయోజనాలు, కార్యాచరణ సౌలభ్యం కోసం సముద్ర ప్రయాణంలో ఉన్న నౌకలు గమ్యస్థానాలను మార్చుకోవడం సాధారణం" అని మంత్రిత్వ శాఖ వివరించింది.

ఇదే సమయంలో ఇరాన్ నుంచి ఎల్‌పీజీ సరఫరాపై వస్తున్న కథనాలను కూడా ప్రభుత్వం ఖండించింది. ఇరాన్‌కు చెందిన 'సీ బర్డ్' అనే నౌక సుమారు 44 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో ఏప్రిల్ఈ నెల‌ 2న మంగళూరుకు చేరుకుందని, ప్రస్తుతం సరుకును అన్‌లోడ్ చేస్తోందని ధృవీకరించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, రాబోయే నెలలకు అవసరమైన ముడి చమురును ఇరాన్‌తో సహా వివిధ దేశాల నుంచి భారత రిఫైనరీలు ఇప్పటికే భద్రపరుచుకున్నాయని, సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Go Back to Shorts
Iran Oil Tanker
Iran
Crude Oil
India
China
Oil Imports
Ping Shun
Vadinar
Ministry of Petroleum and Natural Gas
LPG Supply

More Telugu News