Pakistan Economy: రంజాన్ వేళ పాకిస్థాన్‌లో భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Pakistan Fuel Prices Soar During Ramzan
పవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్‌లో ఇంధన ధరలు భారీగా పెరగడం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై ఏకంగా 55 రూపాయల మేర పెంచింది. దాంతో పెట్రోల్ ధర లీటర్ రూ.321కి పెరిగింది. డీజిల్ ధర కూడా అదే స్థాయిలో భగ్గుమంటోంది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా రవాణా ఛార్జీల నుంచి నిత్యావసరాల ధరల వరకు అన్నింటిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంధన ధరల పెంపు మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ కూలీలపై పెనుభారం మోపుతోందని 'డాన్' పత్రిక తన నివేదికలో వెల్లడించింది.

రంజాన్ మాసంలో సాధారణంగానే కుటుంబ బడ్జెట్‌లు ఒత్తిడికి గురవుతాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించాల్సింది పోయి, ధరలు పెంచడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈద్ పండుగ ఖర్చుల కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ భారం వారి కొనుగోలు శక్తిని దెబ్బతీస్తోందని నివేదిక పేర్కొంది. 

పాకిస్థాన్ ఎక్కువగా ఇంధన దిగుమతులపై ఆధారపడటంతో అంతర్జాతీయ మార్పులు దేశీయ ధరలను కుదిపేస్తున్నాయి. ధరల పెంపు ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే దేశంలోని కరాచీ, పెషావర్‌ వంటి ప్రధాన నగరాల్లో రవాణా ఛార్జీలు పెరిగాయి. దీంతో ప్రజా రవాణాపై ఆధారపడే లక్షలాది మంది రోజువారీ ఖర్చులు అమాంతం పెరిగాయి. ఇంధన ధరలు పెరిగిన వెంటనే వ్యాపారులు నిత్యావసరాల ధరలను పెంచుతున్నారని, మరోవైపు పెషావర్‌లో పెట్రోల్ అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గినట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజల ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.

గమనిక: పైన తెలిపిన ధరలు పాకిస్థానీ రూపాయల్లో.
Pakistan Economy
Petrol price
Diesel price
Ramzan
Fuel prices
Inflation
Karachi
Peshawar
Economic crisis
Pakistan

More Telugu News