Rahul Dravid: బ్యాటింగ్ లెజెండ్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారం!

Rahul Dravid Receives Lifetime Achievement Award
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 15న దేశ రాజధాని ఢిల్లీలో 'నమన్' పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రతిష్ఠాత్మక కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం లభించనుంది. అదేవిధంగా, భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను 'ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్' (పాలి ఉమ్రిగర్ అవార్డు) విభాగంలో ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ద్రవిడ్‌ను  లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆయన మార్గనిర్దేశంలోనే భారత్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు, 2025లో టెస్టుల్లో 983 పరుగులు, వన్డేల్లో 490 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరిచిన శుభ్‌మన్ గిల్‌కు 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గౌరవం దక్కనుంది. టీ20 ప్రపంచకప్ జట్టులో గిల్ సభ్యుడు కానప్పటికీ, టెస్టులు, వన్డేల్లో నిలకడైన ప్రదర్శనతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

ఈ వేడుకలో... ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లతో పాటు అండర్-19 ప్రపంచకప్ విజేతలను కూడా బీసీసీఐ సత్కరించనుంది. అయితే, ఇదే రోజున దేశవాళీ టోర్నీల ఫైనల్స్ ఉండటంతో కొంతమంది మహిళా క్రికెటర్లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోవచ్చని సమాచారం.

దేశవాళీ క్రికెట్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన అసోసియేషన్ గా ముంబై క్రికెట్ అసోసియేషన్ వరుసగా మూడోసారి అవార్డు అందుకోనుంది. వీరితో పాటు రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన యశ్ రాథోడ్, యశ్ దూబేలకు మాధవరావు సింధియా అవార్డులు, ఉత్తమ అంపైర్‌గా ఉల్హాస్ గాంధే తదితరులకు కూడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

Go Back to Shorts
Rahul Dravid
BCCI Awards
Shubman Gill
Naman Awards
Indian Cricket
Cricket Award
Lifetime Achievement Award
Cricket
T20 World Cup

More Telugu News