చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్
- చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్
- ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలన్న డిప్యూటీ సీఎం
- రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష
రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని పవన్ కితాబునిచ్చారు. రాయలసీమలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదని అన్నారు. మే నెలలోపు లక్ష 55 వేల నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని... వర్షాల సమయంలో ఈ కుంటలన్నీ నిండితే ఒక టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రం బాగుండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని... ఆయనను ప్రేరణగా తీసుకుని తనకు అప్పగించిన శాఖలన్నింటినీ బలోపేతం చేస్తున్నానని చెప్పారు. ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామని అన్నారు. రాష్ట్రంలో 52.92 లక్షల కుటుంబాల్లో 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లో ఉపాధి కల్పించామని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 4 వేల పైచిలుకు రోడ్లు మాత్రమే నిర్మించారని... ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని పవన్ వెల్లడించారు. 100 మందికి పైగా జనాభా ఉన్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీటితో పాటు మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.