పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ!

Good news for aspiring pilots training now in Andhra Pradesh
  • ఏపీలో కొత్తగా ఆరు పైలట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు 
  • కర్నూలు, కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో ఈ కేంద్రాల నిర్మాణం
  • ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో డీజీసీఏ అనుమతితో పైలట్లకు శిక్షణ
  • ఒక్కో కేంద్రంలో 30 నుంచి 40 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు
  • నాగార్జున సాగర్ వద్ద కూడా మరో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక
ఏపీ ఏవియేషన్ రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో పైలట్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త అందిస్తూ, ప్రభుత్వం కొత్తగా ఆరు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌టీవో) ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేని ఈ సౌకర్యం కర్నూలు, కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల వేదికగా ప్రారంభం కానుంది. ఈ కేంద్రాల రాకతో ఏపీ ఏవియేషన్ శిక్షణలో ఒక ముఖ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది.

మొత్తం మూడు విమానాశ్రయాల్లో ఆరు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏపీఏడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) నిర్వహణలో ఉన్న కర్నూలు విమానాశ్రయంలో రెండు ఎఫ్‌టీవోలు రానున్నాయి. వీటిలో మొదటి కేంద్రాన్ని ఈ నెల 22న ప్రారంభించనుండగా, మరొకటి డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. 

ఇక, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోని రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో రెండేసి చొప్పున కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రాజమహేంద్రవరంలో టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. కడపలో ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ మొదలైంది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ఎఫ్‌టీవోల ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థలు ఈ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తాయి. ఒక్కో కేంద్రం ద్వారా సుమారు 30 నుంచి 40 మందికి పైలట్ శిక్షణ ఇస్తారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందడానికి అవసరమైన 180 గంటల విమాన శిక్షణను ఈ కేంద్రాల్లో పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ఆయా సంస్థలు ఎయిర్‌పోర్ట్ రన్‌వేకు అనుసంధానంగా ప్రత్యేక హ్యాంగర్లు నిర్మించి, చిన్న విమానాల ద్వారా శిక్షణ అందిస్తాయి.

వీటితో పాటు నాగార్జున సాగర్ వద్ద ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో కూడా ఒక ఎఫ్‌టీవోను ఏర్పాటు చేసేందుకు ఏపీఏడీసీఎల్ ఇప్పటికే అనుమతులు పొందింది. భవిష్యత్తులో అక్కడ కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ప్రస్తుత ఎయిర్‌స్ట్రిప్‌ను ఏపీఏడీసీఎల్‌కు బదిలీ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పరిణామాలతో పైలట్ శిక్షణ కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.
Advertisement
Andhra Pradesh Aviation
Pilot Training Centers AP
Kurnool Airport FTO
Kadapa Airport Flying School
Rajamahendravaram Airport Training
Commercial Pilot License India

More Telugu News