ప్యాకెట్ మాత్రమే మారింది... లోపలి విషం మాటేంటి?: ప్లాస్టిక్ ప్యాకింగ్‌ నిషేధంపై విమర్శలు

FSSAI bans plastic packaging for Pan Masala amid health concerns
  • పాన్ మసాలా ప్యాకేజింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
  • ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్‌కు బదులు కాగితం వాడాలని ఆదేశం
  • ఉత్పత్తిపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ 
  • లోపలి పదార్థం క్యాన్సర్ కారకమంటూ నిపుణుల ఆందోళన
  • ప్యాకింగ్ మార్పు పైపై మెరుగులేనని వెల్లువెత్తుతున్న విమర్శలు
పాన్ మసాలా, గుట్కా ప్యాకేజింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్ లేదా మెటలైజ్డ్ ప్యాకెట్లలో పాన్ మసాలా అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ ) ఆదేశాలు జారీ చేసింది. వాటికి బదులుగా కాగితం, సెల్యులోజ్, టిన్ లేదా గ్లాస్ ప్యాకేజింగ్‌ను మాత్రమే ఉపయోగించాలని ఆగస్టు 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

అయితే, ఈ మార్పు కేవలం ప్యాకేజింగ్‌కు సంబంధించినదేనని, పాన్ మసాలా ఉత్పత్తిపై ఎలాంటి నిషేధం విధించడం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ  స్పష్టంగా తెలిపింది. పర్యావరణ హితం కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆరోగ్య నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు సమస్యను పక్కనపెట్టి, కేవలం ప్యాకింగ్ మార్చడం కంటితుడుపు చర్యేనని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన ఏజెన్సీ (ఐఏఆర్‌సీ), పాన్ మసాలాలో ప్రధానంగా వాడే వక్కను (సుపారీ) గ్రూప్ 1 క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. అంటే, ఇది మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమవుతుందని కచ్చితంగా నిరూపితమైంది. పొగాకు లేని పాన్ మసాలా కూడా సురక్షితం కాదని, అది కూడా క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల "ఓరల్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్" అనే వ్యాధి వచ్చి, నోటి లోపలి చర్మం గట్టిపడి, నోరు సరిగా తెరవలేని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.

భారత్‌లో నమోదయ్యే మొత్తం క్యాన్సర్ కేసుల్లో దాదాపు 30 శాతం నోటి క్యాన్సర్‌వే. ఏటా సుమారు 1.20 లక్షల కొత్త కేసులు, 72,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం ప్యాకింగ్ మార్చడం కాకుండా, క్యాన్సర్‌కు కారణమవుతున్న ఉత్పత్తిని పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
Advertisement
FSSAI
Pan Masala
Plastic Packaging Ban
Oral Cancer
Gutka Packaging Rules
IARC Cancer Research

More Telugu News