అద్దె ఇల్లు చూస్తుండగా దంపతులపై శునకం దాడి.. సీసీటీవీలో రికార్డ‌యిన భ‌యాన‌క దృశ్యాలు!

Pitbull attack on couple while looking for rental house CCTV visuals recorded
  • పాటియాలలో గేటు తీయగానే బయటకు వచ్చి మహిళపై దాడి చేసిన శునకం
  • దాడిలో మహిళకు తీవ్ర గాయాలు, సర్జరీ చేసిన వైద్యులు
  • శునకం యజమానిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
పంజాబ్‌లోని పాటియాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు చూసేందుకు వెళ్లిన ఓ జంటపై పిట్‌బుల్ జాతికి చెందిన శునకం భీకరంగా దాడి చేసింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అంకిత్ సబర్వాల్, అతని భార్య షిఫాలీ మంగళవారం సాయంత్రం పాటియాలలోని ఘుమాన్ నగర్ ప్రాంతంలో ఓ ప్రాపర్టీ డీలర్‌తో కలిసి అద్దె ఇల్లు చూసేందుకు వెళ్లారు. వారు ఇంటి గేటు తెరవగానే, లోపలి నుంచి పిట్‌బుల్ ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొదట షిఫాలీపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. భార్యను రక్షించే ప్రయత్నంలో అంకిత్‌పైనా ఆ కుక్క దాడి చేసింది. అతని కాళ్లు, వీపుపై గాయాలయ్యాయి. వారి అరుపులు విన్న స్థానికులు కర్రలతో వచ్చి కుక్కను తరిమివేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ దాడిలో షిఫాలీకి అయిన గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జంతువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు యజమానిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 291 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన‌ట్లు తెలిపారు. దూకుడు స్వభావం ఉన్న శునకాలను పెంచుకోవడంపై ఆంక్షలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Pitbull
Patiala dog attack
Punjab news
CCTV dog attack footage
Ankit Sabharwal
Dangerous dog breeds India

More Telugu News