టీమిండియాతో టెస్టుకు ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ.. కీలక ఆటగాళ్లు ఔట్

Sri Lanka suffer big blow ahead of Test series against India as key players are out
  • భారత్‌తో తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో శ్రీలంక జట్టు ప్రకటన
  • గాయాల కారణంగా కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సంక దూరం
  • వెటరన్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు ఏడాది తర్వాత మళ్లీ చోటు
  • ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంతకు తొలిసారిగా జాతీయ జట్టులో ఛాన్స్‌
  • కెప్టెన్‌గా జట్టును నడిపించనున్న ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వా
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఆ జట్టు కీలక బ్యాటర్లు కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వా సారథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) నేడు ప్రకటించింది.

గ‌త నెల‌ 19న కొలంబోలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్‌) మ్యాచ్‌లో పరుగు తీస్తుండగా కుశాల్ మెండిస్ కుడి తొడ కండరాలకు గాయమైంది. అప్పటి నుంచి అతను జాతీయ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో కోలుకుంటున్నాడు. మరోవైపు మరో ఓపెనర్ పతుమ్ నిస్సంక గత నెలలో లండన్‌లో మణికట్టుకు చేయించుకున్న శస్త్రచికిత్స నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయారు.

ఈ కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో సెలక్టర్లు వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా వైపు మొగ్గు చూపారు. 2023లో చివరిసారిగా టెస్టు ఆడిన డిక్వెల్లా, 54 టెస్టుల అనుభవంతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడిన అంజలా బండార కంటే డిక్వెల్లా అనుభవానికే సెలక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే ప్రాక్టీస్ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంతకు తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కింది. పేసర్లు కసున్ రజిత, ఇసిత విజేసుందరపై వేటు పడింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో 66, 63 నాటౌట్ స్కోర్లతో రాణించిన నిషాన్ మధుష్క జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

జట్టుకు ధనంజయ డిసిల్వా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కమిందు మెండిస్ వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దినేశ్‌ చండిమాల్, లహిరు ఉడార, పసిందు సూరియబండార, సోనాల్ డినుషాలతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. స్పిన్ విభాగానికి ప్రభాత్ జయసూర్య నాయకత్వం వహించనుండగా, అతనికి రమేశ్‌ మెండిస్, కొత్త కుర్రాడు నువంత సహకారం అందించనున్నారు. ఇక, పేస్ దళానికి అసిత ఫెర్నాండో సారథ్యం వహించనుండగా, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, దిల్షాన్ మధుశంకలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరగనుంది.

శ్రీలంక జట్టు: 
ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), లహిరు ఉడార, నిషాన్ మధుష్క, దినేశ్‌ చండిమాల్, పసిందు సూరియబండార, సోనాల్ డినుషా, నిరోషశ్‌ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్‌ మెండిస్, ప్రభాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక.
Advertisement
Sri Lanka Cricket Team
Dhananjaya de Silva
India vs Sri Lanka Test Series
Kusal Mendis injury
Pathum Nissanka
Niroshan Dickwella

More Telugu News