కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టేది?: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ట్రాఫిక్ పోలీసులకు వేతనంతో 30 శాతం అలవెన్స్‌లు ఇస్తున్నామన్న కేసీఆర్
- ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి
- మూడోసారి అధికారంలోకి రాగానే ఫిట్‌నెస్ ఛార్జీ, సర్టిఫికెట్ ఖర్చులు మాఫీ చేస్తామని ప్రకటన
- ఇందిరాగాంధీ హయాంలో ఆకలి చావులు తప్ప ఇంకేమీ లేవన్న కేసీఆర్
- ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి కిలో బియ్యం రూ.2కు ఇచ్చారని వ్యాఖ్య
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ ఖర్చులను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఆటోవాళ్లకు శుభవార్త చెబుతున్నానని, వారికి వచ్చే ఆదాయమే తక్కువ అని, కాబట్టి మూడోసారి మన ప్రభుత్వం రాగానే పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
సంవత్సరానికోసారి ఫిట్‌నెస్ చేయించుకోవాలని, ఆ ఫిట్‌నెస్‌కు వెళ్తే రూ.700, సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.500 ఛార్జ్ చేస్తారని తెలిపారు. ఈసారి బీఆర్ఎస్ గెలిచాక ఈ ఫిట్‌నెస్ ఛార్జీలను రద్దు చేస్తామన్నారు. కరీంనగర్‌కు తనకు ఏదో శ్రుతి ఉందన్నారు. తాను ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని, అలాగే ఇక్కడి నుంచి ఏదో ఒక పథకం ప్రకటిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు ఆటో కార్మికులకు స్కీమ్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలందరికీ క్రమంగా అన్నీ చేసుకుంటూ పోతున్నామన్నారు.
ఒకనాడు తెలంగాణకు నష్టం చేసిందే కాంగ్రెస్ అని, బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాతో కలిపారన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా... బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో అందరూ ఆలోచించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఏమీ లేవన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి కిలో బియ్యం రూ.2కు ఇచ్చేవరకు ఆకలి చావులే అన్నారు. కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ ఎందుకు పుట్టేది? అని ఆయన ప్రశ్నించారు.