ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ కియా ఇండియా కొత్త సిరోస్‌ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధరను రూ.13.49 లక్షలుగా నిర్ణయించింది. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 526 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. జులై 30న డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

సిరోస్‌ ఈవీని 42 కిలోవాట్‌ అవర్‌, 51.4 కిలోవాట్‌ అవర్‌.. రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. 42 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో 443 కిలోమీటర్లు, 51.4 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో 526 కిలోమీటర్ల వరకు రేంజ్‌ లభిస్తుందని తెలిపింది. ఈ సెగ్మెంట్‌లో 500 కిలోమీటర్లకు పైగా సర్టిఫైడ్‌ రేంజ్‌ను అందిస్తున్న తొలి మోడల్‌గా సిరోస్‌ ఈవీ నిలిచిందని కియా పేర్కొంది.

డిజైన్‌ పరంగా పెట్రోల్‌ సిరోస్‌ను పోలి ఉన్నప్పటికీ, ఈవీ కోసం ప్రత్యేకంగా క్లోజ్డ్‌ డిజిటల్‌ టైగర్‌ ఫేస్‌ గ్రిల్‌, కొత్త బంపర్లు, ఐస్‌ క్యూబ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, స్టార్‌ మ్యాప్‌ లైటింగ్‌, ఏరో అలాయ్‌ వీల్స్‌, ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌ను అందించారు. మొత్తం తొమ్మిది రంగుల్లో ఈ మోడల్‌ను విక్రయించనున్నారు.

క్యాబిన్‌లో 30 అంగుళాల ట్రినిటీ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, ఎనిమిది స్పీకర్ల హార్మన్‌ కార్డన్‌ సౌండ్‌ సిస్టమ్‌, ముందు, వెనుక వెంటిలేటెడ్‌ సీట్లు, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, 16 లీటర్ల ఫ్రంక్‌ వంటి ఫీచర్లను అందించారు.

పెద్ద బ్యాటరీ వేరియంట్‌ 0 నుంచి 100 కిమీ వేగాన్ని 8.1 సెకన్లలో అందుకుంటుంది. 100 కిలోవాట్‌ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జ్‌ కావడానికి కేవలం 39 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది.

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్‌-2 ఏడీఏఎస్‌, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్‌ వ్యూ మానిటర్‌, ఈఎస్‌సీ, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఐఎస్‌ఓఫిక్స్‌ చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌ వంటి ఫీచర్లను అందించారు.