కన్నడలో విజయ్ రాఘవేంద్రకి మంచి క్రేజ్ ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆయన హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో 'కేస్ ఆఫ్ కొండాన' ఒకటిగా చెప్పుకోవచ్చు. దేవీప్రసాద్ శెట్టి దర్శకత్వం  వహించిన ఈ సినిమా, 2024లో జనవరి 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. అనూహ్యమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. భావన కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజు (జులై 23) నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

'చామరాజ్ పేట్' పోలీస్ స్టేషన్ విల్సన్ ( విజయ్ రాఘవేంద్ర) కొత్తగా డ్యూటీలో చేరతాడు. అక్కడ ఏఎస్ ఐగా లక్ష్మీ (భావన) ఉంటుంది. ఆమె తండ్రి త్యాగరాజ్ (రంగాయన రఘు) కూడా మరో పోలీస్ స్టేషన్ లో ఏఎస్ ఐగా పనిచేస్తుంటాడు. లక్ష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. హంతకుడిని వెతికి పట్టుకునే పనిలో లక్ష్మీ బిజీగా ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ మహేంద్ర (బలరాజ్ వాడి) ఆమెకి కుడిభుజంగా ఉంటాడు. 

మహేంద్రకి విల్సన్ కొంత డబ్బు ఇవ్వవలసి ఉంటుంది. తన కారు అమ్మేసి ఇవ్వాలని విల్సన్ నిర్ణయించుకుంటాడు. అదే సిటీలోని ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న 'సహన' (ఖుషీ రవి)ని అతను ప్రేమిస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం డాక్టర్ 'సహన' ఒక కేసును చూస్తుంది. రాజు అనే అతని కొడుకు బసంత్ కి పరీక్షలు చేయించి, ట్రీట్మెంట్ కి 5 లక్షలు సిద్ధం చేసుకోమని చెబుతుంది. రాజు అదే ఏరియాలో రోడ్డు పక్కన 'పానీ పూరి' బండి పెట్టుకుని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. 

మహేంద్రకి డబ్బు ఇవ్వడం కోసం 'కారు'లో వెళుతున్న విల్సన్ కి, ఆ పానీ పూరి బండి దగ్గరే ప్రమాదం జరుగుతుంది. ఆ సమయంలోనే కారులోని డబ్బును 'రాజు' కాజేస్తాడు. ఆ డబ్బు కోసం రాజు - విల్సన్ మధ్య జరిగిన పెనుగులాటలో రాజు చనిపోతాడు. అప్పుడు విల్సన్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనారోగ్యంతో బాధపడుతున్న రాజు కొడుకు పరిస్థితి ఏమిటి? వరుసగా జరుగుతున్న హత్యలకు కారకులు ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

ఇది ఒక పోలీస్ ఆఫీసర్ కథ. సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో డ్యూటీలో దిగిన విల్సన్, అనుకోని సంఘటనతో హంతకుడిగా నిలబడిపోతాడు. ఆ నేరం నుంచి బయటపడటం కోసం అతను చేసే ప్రయత్నాలు, మరిన్ని దారుణాలకు కారణమవుతాయి. అలాంటి పరిస్థితులలో అతను ఏం చేస్తాడు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. 

నగరంలో ఒక వైపున ఒక హంతకుడు పథకం ప్రకారం హత్యలు చేస్తూ వెళుతుంటాడు. మరో వైపున ఎలాంటి ఉద్దేశం లేకుండానే విల్సన్ అనే పోలీస్ అధికారి వరుస మరణాలకు కారకుడవుతూ వెళుతుంటాడు. ఈ రెండు వైపులా ఇన్వెస్టిగేషన్ చేపట్టిన లక్ష్మీకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనే కుతూహలం ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది.  అడుగడుగునా ఉత్కంఠను పెంచుతూ వెళుతుంది.  

ఒక వైపున ఒక పాత్రకు.. మరో పాత్రకి గల సంబంధాలు .. అనుబంధాలు, మరో వైపున ఆ పాత్రల చుట్టూనే తిరిగే కథ ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. విశ్రాంతి సమయానికి దర్శకుడు ఒక రేంజ్ కి కథను తీసుకొచ్చి వదులుతాడు. సెకండాఫ్ ఫస్టు సీన్ నుంచే ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటుంది. ఆ టెంపో క్లైమాక్స్ వరకూ అలా కంటిన్యూ చేయడమే దర్శకుడి గొప్పతనంగా చెప్పుకోవాలి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ రెండూ కూడా మరింత బలంగా కనెక్ట్ అవుతాయి.

కొంతమంది పోలీసులు తొందరపాటు కారణంగా నేరస్థులుగా మారుతుంటారు. అలాంటివాళ్లను కాపాడటానికి కొంతమంది పోలీసులు ప్రయత్నిస్తే, తమ్ముడు మనవాడైనా ధర్మం తప్పకూడదు అన్నట్టుగా మరికొందరు పోలీసులు వ్యవహరిస్తూ ఉంటారు. అలా పోలీసులలోని మూడు కోణాలను దర్శకుడు చూపించిన తీరు మెప్పిస్తుంది.

ఈ కథలో ప్రధానమైన పాత్రలలో కనిపించేది పోలీసులే. విజయ్ రాఘవేంద్రతో పాటు ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. నిజమైన పోలీసుల మాదిరిగానే అనిపిస్తారు. విశ్వజిత్ రావు కెమెరా పనితనం .. గగన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ కూడా చాలా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది.  

ఎవరూ లేని ప్రదేశంలో .. ఎవరూ చూడని సమయంలో నేరం చేసినా, ప్రకృతి అక్కడ ఒక సాక్షిని సృష్టిస్తూనే ఉంటుంది అనే దిశగా ఈ కథ నడుస్తుంది. మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. బలమైన కథాకథనాలతో సాగిపోయే ఈ సినిమా, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి మరింతగా నచ్చేస్తుందని చెప్పచ్చు.