కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీల వరుస భేటీలు

TDP MPs meets Union ministers in Delhi
టీడీపీ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాల అమలు, బిల్లులు చెల్లింపు తదితర అంశాలపై వారు కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిశామని వెల్లడించారు.

2019 జూన్ 1 వరకు చేసిన ఎంజీఎన్ఆర్ జీఈఎస్ పనుల బిల్లులను వైసీపీ సర్కారు నిలిపివేసిందని, కానీ ఆ నిధులను 2019 జూన్ 1 తర్వాత చేసిన పనులకు చెల్లిస్తోందని తాము కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఈ విధమైన నిధుల మళ్లింపు ఎంజీఎన్ఆర్ జీఈఎస్ ప్రమాణాలకు వ్యతిరేకమన్న విషయాన్ని ఆయనకు తెలిపామని పేర్కొన్నారు.

గతంలో చేపట్టిన పనులకు ఎందుకు నిధులు చెల్లింపులు జరపలేదో విచారణకు ఆదేశించాలని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కోరామని గల్లా జయదేవ్ వెల్లడించారు. అంతేకాకుండా, పాలనా పరమైన ఆలస్యం కారణంగా పెండింగ్ చెల్లింపులను 24 శాతం వడ్డీతో కలిపి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. కాగా, టీడీపీ మంత్రులు అంతకుముందు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని కూడా కలిశారు. టీడీపీ ఎంపీల బృందంలో గల్లా జయదేవ్ తో పాటు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.
Go Back to Shorts
Telugudesam
MPs
Union Ministers
New Delhi

More Telugu News