ప్లాస్టిక్‌ స్ట్రాల వల్ల పర్యావరణానికి ముప్పు అని భావించి.. వాటి స్థానంలో పేపర్‌ స్ట్రాలను వాడుతున్నారా? అయితే ఓసారి ఆలోచించాల్సిందే! పర్యావరణహితమని భావిస్తున్న పేపర్‌ స్ట్రాల వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయని దక్షిణ కొరియాలో నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. కొన్ని పర్యావరణ ప్రభావాల విషయంలో ఇవి సంప్రదాయ ప్లాస్టిక్‌ స్ట్రాల కంటే ఎక్కువ హాని కలిగిస్తున్నట్లు గుర్తించింది. 

క్యాన్సర్‌ ప్రభావ సూచికలో 6.33 రెట్లు ఎక్కువ
దక్షిణ కొరియా వాతావరణ, ఇంధన, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ అధ్యయనాన్ని చేయించింది. పీపుల్స్‌ పవర్‌ పార్టీ ఎంపీ కిమ్‌ వి-సాంగ్‌ అక్టోబర్‌ 21న దీని వివరాలను వెల్లడించారు. సంప్రదాయ ప్లాస్టిక్‌, పేపర్‌, జీవ విచ్ఛిన్నమయ్యే ప్లాస్టిక్‌, మొక్కల ఆధారిత పాలిథిలీన్‌ స్ట్రాల ప్రభావాలను పరిశోధకులు పోల్చారు. తయారీ నుంచి వినియోగం, వ్యర్థాల తొలగింపు వరకు మొత్తం జీవిత చక్రాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో పేపర్‌ స్ట్రాల క్యాన్సర్‌ కారక ప్రభావ సూచిక ప్లాస్టిక్‌ స్ట్రాలతో పోలిస్తే 6.33 రెట్లు ఎక్కువగా నమోదైంది. 

పేపర్‌ స్ట్రాల కంటే మరో రకం మరింత ప్రమాదకరం
మొక్కల నుంచి తయారు చేసే బయో-బేస్డ్‌ పాలిథిలీన్‌ (బయో-పీఈ) స్ట్రాల ప్రభావ సూచిక ప్లాస్టిక్‌తో పోలిస్తే 16.18 రెట్లు ఎక్కువగా ఉంది. జీవ విచ్ఛిన్నమయ్యే ప్లాస్టిక్‌ స్ట్రాల్లో ఈ సూచిక 3.34 రెట్లుగా నమోదైంది. అయితే ఇవి స్ట్రాలను ఉపయోగించే వ్యక్తులకు నేరుగా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని సూచించే గణాంకాలు కావు. ఉత్పత్తుల తయారీ, వినియోగం, వ్యర్థాల నిర్వహణ సమయంలో వెలువడే ఉద్గారాల ఆధారంగా అంచనా వేసిన ప్రభావాలు మాత్రమే. 

రీసైక్లింగ్‌ చేయడంలోనూ ఇబ్బందులే
స్ట్రాలు ఏ పదార్థంతో తయారైనా వాటిని రీసైక్లింగ్‌ చేయడం కష్టమేనని అధ్యయనం పేర్కొంది. వాటి చిన్న పరిమాణం కారణంగా వ్యర్థాల వేర్పాటు కేంద్రాల్లో గుర్తించి వేరు చేయడం కష్టమవుతోంది. పూతలు, అంటుకునే పదార్థాలు కూడా రీసైక్లింగ్‌కు అడ్డంకిగా మారుతున్నాయి. అందుకే స్ట్రాల పదార్థాన్ని మార్చడం ఒక్కటే పరిష్కారం కాదని పరిశోధకులు సూచించారు. దుకాణాల్లో అడగకుండానే డిస్పోజబుల్‌ స్ట్రాలు ఇవ్వకుండా, వినియోగదారులు కోరినప్పుడు మాత్రమే అందించాలని సిఫారసు చేశారు.