ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్‌లోని ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ ప్రాంతానికి సమీపంలో రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్లు ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో ఫెరిచే ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఫిష్‌టైల్‌ ఎయిర్‌, ఎయిర్‌ డైనాస్టీ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ఒకే హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో రెండు హెలికాప్టర్ల రోటర్‌ బ్లేడ్లు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సోలుఖుంబు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనలో ఓ భారత పర్యాటకుడు మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో లుక్లాకు తరలించారు. ప్రమాదంలో రెండు హెలికాప్టర్ల పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత మంటలు చెలరేగకపోవడం మరింత ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరిగిన ప్రాంతం ఎవరెస్ట్‌ పర్వతారోహణ మార్గంలో కీలకమైనది. ఇక్కడ పర్యాటకులు, పర్వతారోహకుల రవాణాకు హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తుంటారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.