ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు దిగింది. తమ సంస్థలోని డివైజెస్ యూనిట్‌లో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కిండిల్ ఈ-రీడర్స్, ఎకో స్మార్ట్ స్పీకర్ల వంటి ఉత్పత్తులను తయారు చేసే విభాగంలో ఈ కోతలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న వారిపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది.

'రాయిటర్స్' కథనం ప్రకారం.. తొలగింపునకు గురైన ఉద్యోగులకు బుధవారం తెల్లవారుజామునే ఈ-మెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిన్సన్ పంపిన ఈ-మెయిల్‌లో.. సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా సమీక్షించామని, దీని ఫలితంగా కొన్ని ఉద్యోగాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. గతంలో మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు కూడా ఇదే తరహాలో ఉదయాన్నే ఈ-మెయిల్స్ ద్వారా ఉద్యోగులను తొలగించాయి.

ఈ లేఆఫ్‌లను అమెజాన్ అధికారికంగా ధ్రువీకరించింది. "కొన్ని ఉద్యోగాలను తొలగించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాం" అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంతమందిని తొలగించారనే సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ, 250 మంది ఉద్యోగాలను కోల్పోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మరింత సమర్థవంతంగా పనిచేయడం, తమ ఉత్పత్తి ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ వివరించింది.

ఈ నిర్ణయం వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై కంపెనీ దృష్టి సారించడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. లేఆఫ్‌లకు ఒకరోజు ముందు, ఏఐ యుగంలో డెవలపర్‌ల పాత్రపై కంపెనీ ఇంజనీరింగ్ నాయకత్వం ఒక మెమోను విడుదల చేసింది. "మనమందరం ఈ మార్పును స్వీకరించాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి, లేదంటే వెనుకబడిపోతాం" అని ఆ మెమోలో పేర్కొంది. 

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విధానంలో ఏఐ కేంద్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది అమెజాన్ ఒక్కటే ఏఐపై ఏకంగా 220 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనుంది.

ఆశ్చర్యకరంగా ఉద్యోగాల కోత ప్రకటించిన రోజే అమెజాన్ ఐదు కొత్త అలెక్సా ఆధారిత డివైజ్‌లను ప్రకటించింది. వీటిలో కొత్త ఎకో షో 16 స్మార్ట్ డిస్‌ప్లే, అలెక్సా ఫోటో ఫ్రేమ్, ఎకో టైమ్ బెడ్‌సైడ్ క్లాక్ వంటివి ఉన్నాయి. ఈ ఉత్పత్తులన్నీ ఉద్యోగాలు కోల్పోయిన డివైజెస్ యూనిట్ అభివృద్ధి చేసినవే కావడం గమనార్హం.

అమెజాన్‌లో ఉద్యోగాల కోత ఇదే తొలిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో రిటైల్ విభాగంలో దాదాపు 1,000 ఉద్యోగాలను తగ్గించింది. గత ఏడాది అక్టోబర్‌లో 14,000 మందిని, ఈ ఏడాది జనవరిలో 16,000 మందిని తొలగించింది. టెక్ పరిశ్రమ వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోంది. 

ఈ ఏడాది ఇప్పటివరకు 1,35,000 మంది టెక్ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారని Layoffs.fyi వెబ్ సైట్ పేర్కొంది. ఇటీవల డ్రాప్‌బాక్స్ 9% ఉద్యోగులను, మైక్రోసాఫ్ట్ సుమారు 60,000 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాలను కల్పించాయి.