ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) ఎన్నికల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకగ్రీవాల్లో ప్రభంజనం సృష్టించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి ఏకగ్రీవమైన ఎంపీటీసీల వివరాలను వెల్లడించింది. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,985 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎస్ఈసీ తెలిపింది. వీటిలో సింహభాగం కూటమి ఖాతాలోకే చేరాయి. మరో 58 ఎంపీటీసీ స్థానాలు కూడా కూటమి పరం కానున్నాయని అంచనా వేస్తున్నారు.

మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 20.78 శాతం, అంటే 2,043 స్థానాలు ఏకపక్షంగా ముగిశాయి. వీటిలో అధికార కూటమి ఏకంగా 1,934 స్థానాలను (94.66 శాతం) కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీ 1,781, జనసేన 101, బీజేపీ 52 స్థానాలను దక్కించుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కేవలం 93 స్థానాలకే పరిమితం కాగా, ఇతరులు 16 చోట్ల విజయం సాధించారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై కూటమి భారీ ఆధిక్యం సాధించింది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోని 7 మండలాల్లోని 65 ఎంపీటీసీ స్థానాలకు గాను, 64 స్థానాలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అలాగే, కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న 413 స్థానాలకు గాను కూటమి 338 స్థానాలు సాధించగా, వైసీపీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. పల్నాడు జిల్లాలోనూ ఇదే హవా కొనసాగింది. అక్కడ 419 స్థానాలకు గాను 382 ఏకగ్రీవం కాగా, వాటిలో అత్యధికం కూటమికే దక్కాయి.

ఈ ఏకగ్రీవ ఫలితాలతో రాష్ట్రంలోని 659 మండల పరిషత్‌లలో సుమారు 130 పరిషత్‌లు పోలింగ్ జరగకుండానే కూటమి ఖాతాలో చేరనున్నాయి. కాగా, కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య కుదిరిన అవగాహన మేరకు కొన్ని స్థానాలను పంచుకున్నట్లు సమాచారం.