చైనాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరచడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.  సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తన దృష్టికి రాగానే  అధికారులను అప్రమత్తం చేశారు.

చైనా సోర్సింగ్, లాజిస్టిక్స్ రంగ నిపుణుడు ప్రావిన్ గణేశన్ బుధవారం 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు. దక్షిణ భారతదేశంలో అసెంబ్లీ, ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు కోసం షెన్‌జెన్‌కు చెందిన ఒక ఎలక్ట్రానిక్స్ సంస్థ తనను సంప్రదించిందని ఆయన పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో, అనుమతులను వేగంగా మంజూరు చేయడంలో, సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని తాను ఆ సంస్థకు సూచించినట్లు వివరించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ, #ChooseAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఆయన జత చేశారు.

సదరు పోస్ట్‌పై లోకేశ్ తక్షణమే స్పందించారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మీరు ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు" అని బదులిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగిల్ విండో విధానం ద్వారా సేవలందించే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఏపీ - ఈడీబీ) అధికారులను వెంటనే రంగంలోకి దించారు. సదరు కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు.