రంజీ ట్రోఫీలో యువ ఆల్‌రౌండర్, టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. హరియాణాతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ డి మ్యాచ్‌లో బ్యాట్‌తో సెంచరీ బాదిన అతడు.. బంతితో ఆరు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. 21వ శతాబ్దంలో ఒకే ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఐదుకు పైగా వికెట్లు తీసిన తొలి ముంబై ఆటగాడిగా ముషీర్ ఖాన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఘనత సాధించిన చివరి ముంబై ఆటగాడు రవిశాస్త్రి కావడం విశేషం.

ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 430 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ముషీర్ ఖాన్ 185 బంతుల్లో 109 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. మరో యువ ఆటగాడు అంక్రిష్ రఘువంశీ (114) కూడా శతకంతో రాణించాడు. అనంతరం బౌలింగ్‌లోనూ ముషీర్ తన మ్యాజిక్ చూపించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అతడు 85 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. హరియాణా తొలి ఐదు వికెట్లనూ అతడే తీయడం గమనార్హం.

ముషీర్ దెబ్బకు హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో నిశాంత్ సింధు (105 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ముంబైకి 160 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వెంటనే హరియాణాను ఫాలో ఆన్‌కు ఆహ్వానించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హరియాణా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇంకా 87 పరుగులు చేయాల్సి ఉంది.

లెజెండ్స్ సరసన ముషీర్
ఒకే రంజీ మ్యాచ్‌లో సెంచరీ, ఐదుకు పైగా వికెట్లు తీసిన ఆరో ముంబై క్రికెటర్‌గా ముషీర్ నిలిచాడు. గతంలో మదన్ రాయ్జీ (1947-48), దత్తు ఫడ్కర్ (1948-49), వినూ మన్కడ్ (1953-54), పాలీ ఉమ్రిగర్ (1957-58), రవిశాస్త్రి (1990-91) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక సెంచరీతో పాటు ఆరు వికెట్ల ప్రదర్శన విషయానికొస్తే, 77 ఏళ్ల క్రితం ఫడ్కర్ తర్వాత మళ్లీ ఇప్పుడే ముషీర్ ఆ ఫీట్ నమోదు చేశాడు.

పిచ్ నెమ్మదించిందని, టర్న్ లభించే చోట బంతులు వేయడంపై దృష్టి సారించానని మ్యాచ్ అనంతరం ముషీర్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో వరుసగా మూడో విజయం సాధించి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకోవాలని ముంబై జట్టు పట్టుదలగా ఉంది.