దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. అయితే, ట్రేడింగ్ మధ్యలో ఎదురైన భారీ నష్టాల నుంచి సూచీలు చివరికి గట్టెక్కాయి. సెషన్ రెండో భాగంలో ఆటోమొబైల్, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి పెరగడంతో మార్కెట్లు కోలుకున్నాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 353 పాయింట్లు నష్టపోయి 73,246 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 22,699 వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రా-డే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 72,604 పాయింట్ల కనిష్ఠ‌ స్థాయికి, నిఫ్టీ 22,498 కనిష్ఠానికి పడిపోయాయి. అక్కడి నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు పరిమితమయ్యాయి.

రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.5 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.5 శాతం చొప్పున లాభపడి మార్కెట్లకు అండగా నిలిచాయి. మరోవైపు, ఐటీ, ఆయిల్ & గ్యాస్ సూచీలు దాదాపు 2% చొప్పున పతనం కావడంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా.. లార్సెన్ అండ్ టూబ్రో, అపోలో హాస్పిటల్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటివి లాభపడ్డాయి.