సుస్వాగతం', 'చెన్నకేశవరెడ్డి', 'నాని' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి దేవయాని. ఇప్పుడామె కుమార్తె ప్రియాంక రాజకుమరన్ హీరోయిన్‌గా బిజీ అవుతున్నారు. ఇటీవల 'రంజన్: ది అడ్వకేట్' చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె, తాజాగా తన కొత్త సినిమాను ప్రారంభించారు. 'బ్లాక్ నైట్ బాయ్స్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. 

కాగా, ప్రముఖ తమిళ దర్శకుడు రాజకుమరన్ నటి దేవయాని భర్త అని తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఇనియ పెద్ద కుమార్తె కాగా, ప్రియాంక చిన్న కుమార్తె. ఇనియ గాయనిగా కెరీర్ నిర్మించుకుంటోంది. ప్రియాంక తల్లిబాటలో నటిగా అడుగులు వేస్తోంది. గతంలో దర్శకుడిగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రాజకుమరన్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు.

ఈ చిత్రంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అమల్‌జిత్ హీరోగా నటిస్తున్నారు. సెంబర్ వి. మురుగేశన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని, ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'బ్లాక్ నైట్ బాయ్స్' ఉంటుందని నిర్మాతలు పేర్కొన్నారు.

ఈ సినిమాకు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటం విశేషం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు చేపట్టారు. 'కాదల్' వంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సంగీతం అందించిన జోషువా శ్రీధర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. బాబా భాస్కర్ నృత్యరీతులు, పి.సి. స్టంట్స్ ఫైట్స్ అందిస్తున్నారు. అరుణ్ మురుగన్ పిక్చర్, డ్రీమ్ రన్‌వే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.