తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిర్మాణం పూర్తిచేసుకుని ఫైనల్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి త్వరలోనే ఆ మొత్తాన్ని జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఇల్లు పూర్తయినా ఫైనల్ బిల్లు ఇంకా రాలేదని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలోని నిరుపేదలకు పక్కా గృహాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున, మొత్తం రూ.40 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు.

మొదటి విడతలో ఇళ్లు మంజూరు కాని అర్హులైన పేదలు నిరాశ చెందవద్దని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రభుత్వం దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేస్తుందని, మూడు, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని, తుది చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే తమ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయన్న నమ్మకం వారిలో వ్యక్తమవుతోంది.