థాయ్ రాజకీయాల్లో కొత్త సింబల్.. ప్రధాని ఇచ్చే క్యాసియో వాచ్.. ఏంటీ కథ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థాయ్ రాజకీయాల్లో కొత్త సింబల్.. ప్రధాని ఇచ్చే క్యాసియో వాచ్.. ఏంటీ కథ?

Anutin Charnvirakul Casio Watch New Symbol in Thai Politics
  • థాయ్ ప్రధాని అనుతిన్ నుంచి మంత్రులు, మిత్రులకు ప్రత్యేక బహుమతి
  • తన పేరు చెక్కించిన 60 డాలర్ల క్యాసియో వాచీల పంపిణీ
  • రాజకీయాల్లో పలుకుబడికి, అధికారానికి దగ్గరవడానికి చిహ్నంగా మారుతున్న వాచీలు
  • ఈ వాచీలు ధరించిన వారిని 'క్యాసియో కనెక్షన్'గా గుర్తింపు
  • విధేయతను పెంచుకునే వ్యూహంగా విశ్లేషకుల అంచనా
సాధారణంగా రాజకీయాల్లో నాయకుల చేతికి ఉండే ఖరీదైన వాచీలు వారి హోదాను, పలుకుబడిని ప్రతిబింబిస్తాయి. కానీ, థాయ్‌లాండ్‌ రాజకీయాల్లో ప్రస్తుతం దీనికి భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. లక్షలు విలువ చేసే లగ్జరీ వాచీల స్థానంలో కేవలం 60 డాలర్ల (సుమారు రూ. 5,000) విలువైన ఒక సాధారణ క్యాసియో డిజిటల్ వాచ్.. ఇప్పుడు అధికారానికి దగ్గరగా ఉన్నామని చెప్పే కొత్త స్టేటస్ సింబల్‌గా మారింది.

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్.. తన క్యాబినెట్ మంత్రులకు, సీనియర్ అధికారులకు, రాజకీయ మిత్రులకు ఈ చౌక క్యాసియో వాచీలను బహుమతిగా ఇస్తున్నారు. AE1200WH మోడల్ అయిన ఈ వాచీలను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసి, వాటిపై తన పేరు చెక్కించి మరీ అందిస్తున్నారు. రెట్రో డిజైన్‌తో ఉండే ఈ వాచీలను 'క్యాసియో రాయల్' అని పిలుస్తారు. ప్రధాని నుంచి ఈ వాచీలు అందుకున్న వారిని ఇప్పుడు థాయ్ రాజకీయ వర్గాల్లో 'క్యాసియో కనెక్షన్' అని సరదాగా పిలుస్తున్నారు.

ఈ బహుమతిపై ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎక్కపోబ్ పియాన్‌పిసెస్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా వ్యక్తిగతమని, దీనిలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. ప్రధాని అనుతిన్‌కు ఆ వాచీ మోడల్ అంటే ఇష్టమని, అందుకే వాటిని పంచుతున్నారని వివరించారు. 

ఈ వాచీ అందుకున్న వారిలో ఒకరైన ఉప రవాణా శాఖ మంత్రి సిరిపాంగ్ అంగ్కాసకుల్కియాట్ మాట్లాడుతూ.. వాచీ ధర ముఖ్యం కాదని, దానిని ఇచ్చిన వ్యక్తి ఎవరన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ వాచీ కోసం కొందరు తమ ఖరీదైన లగ్జరీ వాచీలను కూడా పక్కన పెడుతున్నారంటే దీని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.

అయితే, రాజకీయ విశ్లేషకులు దీనిని మరో కోణంలో చూస్తున్నారు. ఇది వివిధ వర్గాల మధ్య విధేయతను పెంచుకోవడానికి, పొత్తులను బలోపేతం చేసుకోవడానికి అనుతిన్ అనుసరిస్తున్న ఒక తెలివైన వ్యూహం కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల క్లా థామ్ పార్టీ నేత థామనాట్ ప్రోంపో సైతం ప్రధాని పేరు చెక్కించిన క్యాసియో వాచ్ ధరించి కనిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. 

గతంలో లగ్జరీ వాచీల వివాదాలతో అట్టుడికిన థాయ్ రాజకీయాల్లో, ఇప్పుడు ఈ చౌక వాచీలు ఒక కొత్త చర్చకు దారితీయడం గమనార్హం. విశేషమేమిటంటే, ప్రధాని అనుతిన్ వద్ద కూడా ఖరీదైన లగ్జరీ వాచీల సేకరణ ఉండటం మరో ఆసక్తికరమైన విషయం.
Advertisement
Anutin Charnvirakul
Thailand Politics
Casio AE1200WH
Casio Royale
Casio Connection
Thai Cabinet Ministers

More Telugu News