పాక్ ఆటగాళ్లతో కూడిన జట్టులో నా పేరా?.. టోర్నీ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ ఆటగాళ్లతో కూడిన జట్టులో నా పేరా?.. టోర్నీ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్!

Shikhar Dhawan slams tournament organizers for unauthorized inclusion in team with Pakistan players
  • వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్‌లో తన పేరును వాడటంపై గ‌బ్బ‌ర్‌ ఆగ్రహం
  • అనుమతి లేకుండా తనను జట్టులోకి తీసుకున్నారని ఆరోపణ
  • నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
  • పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఉన్న ఆసియా వారియర్స్ జట్టులో ధావన్ పేరు
  • ఈ వార్తలను నమ్మవద్దని అభిమానులకు, మీడియాకు విజ్ఞప్తి
టీమిండియా మాజీ ఓపెనర్, స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఓ టీ20 టోర్నమెంట్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అనుమతి లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా టోర్నమెంట్‌లో ఆడుతున్నట్టు ప్రకటించడంపై మండిపడ్డాడు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 'వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్' అనే టోర్నీలో తన పేరును చేర్చడంపై ధావన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

ఈ విషయంపై ట్వీట్ చేసిన ధావన్.. "వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్‌లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో నా పేరు ఉండటం నా దృష్టికి వచ్చింది. నిర్వాహకులు నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా నా పేరును వాడుకున్నారు. ఈ విషయంపై నా బృందం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి అనధికారిక ప్రకటనలను నమ్మవద్దని, వాటి ఆధారంగా వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాను, నా అభిమానులను కోరుతున్నాను. మీ ప్రేమ, మద్దతుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని" అని పేర్కొన్నాడు.

నివేదికల ప్రకారం.. ఈ టోర్నీ కోసం ప్రకటించిన 'ఆసియా వారియర్స్' జట్టులో శిఖర్ ధావన్ పేరును చేర్చారు. ఈ జట్టులో ధావన్‌తో పాటు మరికొందరు భారత మాజీ ఆటగాళ్లు రాహుల్ శర్మ, గుర్కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్ పేర్లు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఇదే జట్టులో పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్లు సోహైల్ తన్వీర్, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వంటి వారి పేర్లను కూడా నిర్వాహకులు ప్రకటించాడు.

భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లతో కూడిన జట్టులో తన పేరును చేర్చడంపై ధావన్ తీవ్రంగా స్పందించాడు. ఈ టోర్నమెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశాడు. ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆటగాడి పేరును, అతని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుండగా, ధావన్ మాత్రం చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నాడు.
Advertisement
Shikhar Dhawan
World T20 Continent Cup
Asia Warriors
Cricket controversy
Legal action
India Pakistan players

More Telugu News