కూటమి పాలనలో కొలువుల జాతర.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం: ఎస్వీఎస్ఎన్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూటమి పాలనలో కొలువుల జాతర.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం: ఎస్వీఎస్ఎన్ వర్మ

SVSN Varma Says Festival of Jobs in Alliance Rule and Promise Kept
  • కూటమి ప్రభుత్వంలో కొలువుల జాతర నడుస్తోందన్న టీడీపీ నేత వర్మ
  • 150 రోజుల్లోనే 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ పూర్తి చేశామని వెల్లడి
  • గెస్ట్ లెక్చరర్లు, పోలీస్ ట్రైనీల పారితోషికాలు, స్టైపెండ్లు భారీగా పెంపు
  • 24 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేశ్ కృషి చేస్తున్నారని వ్యాఖ్య
  • గత వైసీపీ పాలనలో నిరుద్యోగుల భవిష్యత్తు నాశనమైందని విమర్శ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొలువుల జాతర కొనసాగుతోందని, ఇచ్చిన మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. సీబీఎన్ అంటే డీఎస్సీ అని, డీఎస్సీ అంటేనే సీబీఎన్ అని, మాట ఇస్తే నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ మార్క్ పాలన అని ఆయన స్పష్టం చేశారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సారథ్యంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతోందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగులు నరకం చూశారని వర్మ తీవ్రంగా విమర్శించారు. ఒక్క జాబ్ క్యాలెండర్ గానీ, డీఎస్సీ గానీ ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేసి నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపిందని ఆయన పేర్కొన్నారు. 

గతంలో నిలిచిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను పునరుద్ధరించామని, 90 మంది ఎస్టీ యువతకు కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలు, 700 కోయ భారతి టీచర్ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామని వివరించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పారితోషికాన్ని ఒక పీరియడ్‌కు రూ. 150 నుంచి రూ. 375కు పెంచామని, దీనివల్ల వారు నెలకు గరిష్టంగా రూ. 27,000 అందుకునే అవకాశం కలిగిందని వర్మ తెలిపారు. అలాగే, పోలీస్ కానిస్టేబుల్ ట్రైనీలకు నెలకు ఇచ్చే స్టైపెండ్‌ను రూ. 4,500 నుంచి రూ. 12,000కు పెంచి, 5,757 మంది యువతకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువత సంక్షేమానికే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పునరుద్ఘాటించారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దానికి మించి 24 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని వర్మ ప్రశంసించారు. గత 26 నెలల్లోనే పారిశ్రామిక అనుకూల విధానాలతో గూగుల్, గ్రీన్‌కో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు రూ. 29 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించారని గుర్తుచేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోనసీమ అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతానికి అనువైన పరిశ్రమలను నెలకొల్పుతున్నారని అన్నారు. 

యువత ఉపాధి కోసం లోకేశ్‌ విదేశీ పర్యటనలు చేస్తుంటే, ప్రతిపక్షాలు కనీస జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థిక సాయం అందిస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి 'నో అడ్మిషన్స్' బోర్డులు పెట్టే స్థాయికి తీసుకొచ్చామని వర్మ వివరించారు. ప్రజలు మరో 15 ఏళ్లు కూటమి పాలనే కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
SVSN Varma
AP Mega DSC 2024
Nara Lokesh Jobs
Chandrababu Naidu Governance
Andhra Pradesh Employment
TDP Alliance Government

More Telugu News