భర్త రీఎంట్రీపై భువనేశ్వర్ అర్ధాంగి భావోద్వేగ పోస్ట్.. ఏమన్నారంటే?

భర్త రీఎంట్రీపై భువనేశ్వర్ అర్ధాంగి భావోద్వేగ పోస్ట్.. ఏమన్నారంటే?

Bhuvneshwar Kumar wife shares emotional post on husband re-entry to Indian team
  • దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి సీనియర్ పేసర్ భువనేశ్వర్
  • గత రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో తిరిగి చోటు దక్కించుకున్న భువీ
  • భర్తకు మళ్లీ అవకాశం రావడంపై ఇన్‌స్టాలో స్పందించిన అర్ధాంగి నూపుర్ నాగర్
  • చివరగా 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్
న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ నిన్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ జట్టు ఎంపిక అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సీనియర్ పేసర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 

ఒకప్పుడు మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా ఉన్న భువీ, గత కొంతకాలంగా సెలక్టర్ల దృష్టిలో లేకుండాపోయాడు. కానీ, ఐపీఎల్‌లో నిలకడగా రాణించడం అతడికి మళ్లీ జాతీయ జట్టు తలుపులు తెరిచింది.

ఇలా భర్తకు చాలా కాలం త‌ర్వాత‌ మళ్లీ భారత జట్టులో చోటు దక్కడంతో భువనేశ్వర్ అర్ధాంగి నూపుర్ నాగర్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భారత జట్టును ప్రకటించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, చేతులు జోడించిన ఎమోజీతో పాటు 'గ్రాటిడావ్' (కృతజ్ఞత) అని క్యాప్షన్ జోడించారు. అంతటితో ఆగకుండా భువీ రీఎంట్రీపై మాజీ వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్ అభినందనలు తెలుపుతూ చేసిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. 

ఇక‌, 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ చివరగా 2022 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారు. అయితే, పట్టు వదలకుండా దేశవాళీ క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్‌పై దృష్టి సారించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున గత రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతంగా రాణించాడు. 

ఈ రెండు సీజన్లలో కలిపి మొత్తం 45 వికెట్లు పడగొట్టి, జట్టు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కొత్త బంతితో వికెట్లు తీయడంలో, కీలక సమయాల్లో తన అనుభవాన్ని ఉపయోగించి పరుగులు కట్టడి చేయడంలో భువీ చూపిన ప్రతిభ, సెలక్షన్ కమిటీని మెప్పించింది. నిలకడైన ప్రదర్శన, అపారమైన అనుభవం కారణంగా భువనేశ్వర్‌కు ఈ అవకాశం లభించిందని, న్యూజిలాండ్ సిరీస్‌లో అతను ఎలా రాణిస్తాడో చూడాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
Advertisement
Bhuvneshwar Kumar
Nupur Nagar
Indian Cricket Team
India vs New Zealand T20
BCCI Squad Announcement
IPL Performance

More Telugu News