డ్రోన్లను అడ్డుకోవాలంటే రాడార్లు ఎందుకు? చేపల వలలతో పాక్‌ వింత వ్యూహం!

డ్రోన్లను అడ్డుకోవాలంటే రాడార్లు ఎందుకు? చేపల వలలతో పాక్‌ వింత వ్యూహం!

Why radars to stop drones Pakistan strange strategy with fishing nets
  • డ్రోన్లను అడ్డుకునేందుకు చేపల వలలతో రక్షణ ఏర్పాటు చేసిన పాక్‌
  • ఒక్కో చెక్‌పోస్టుకు రూ.1.30 లక్షల ఖర్చు
  • ఐదు జిల్లాల్లో వలలు ఏర్పాటు చేసిన వైనం
  • తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ మిలిటెంట్ సంస్థ డ్రోన్‌ దాడులు పెంచుతున్న నేపథ్యంలో పాక్‌ వింత వ్యూహం
  • వలల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు
డ్రోన్ల దాడులు పెరిగిపోతున్నాయి.. శత్రువును ఎదుర్కోవాలి. అందుకు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు ఉన్నాయి. కానీ అవి ఖరీదైనవి. మరి పాకిస్థాన్‌ ఏం చేసింది? ఏకంగా చేపలు పట్టే వలలనే భద్రతా కవచంగా మార్చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక, పోలీస్‌ చెక్‌పోస్టులపై డ్రోన్‌ దాడులు పెరుగుతుండటంతో.. వాటిని అడ్డుకునేందుకు ఫిషింగ్‌ నెట్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) డ్రోన్లతో దాడులు చేస్తోందని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. ఈ దాడుల నుంచి భద్రతా కేంద్రాలను కాపాడుకునేందుకు అధునాతన యాంటీ డ్రోన్‌ వ్యవస్థలకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ ‘జుగాడ్‌’ (చిట్కా)కు దిగింది.

హంగు జిల్లాలోని సర్కీ పియాలా పోలీస్‌ చెక్‌పోస్టుపై ఏప్రిల్‌ 16న డ్రోన్‌ దాడి జరిగింది. ఆ తర్వాత టీటీపీ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘన్‌ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హంగులో ఈ ఏడాదిలోనే 16 డ్రోన్‌ దాడులు జరిగినట్లు సమాచారం.

దీంతో చెక్‌పోస్టుల పైకప్పులు, చుట్టూ ఉన్న గోడల మధ్య ఫిషింగ్‌ నెట్స్‌ను కడుతున్నారు. డ్రోన్‌ వస్తే దాని ప్రొపెల్లర్లు వలలో చిక్కుకోవాలన్నది ప్లాన్‌. ఒకవేళ డ్రోన్‌ వలపై పేలినా.. పేలుడు శకలాలు నేరుగా నేలపై పడకుండా గాల్లోనే చెదిరిపోయే అవకాశం ఉందని పాకిస్థాన్‌ భద్రతా సిబ్బంది చెబుతున్నారు.

ఒక్క చెక్‌పోస్టును ఇలా కప్పేందుకు సుమారు 1,400 డాలర్లు.. అంటే దాదాపు రూ.1.30 లక్షలు ఖర్చవుతుందని అల్‌జజీరా కథనం పేర్కొంది. అదే యాంటీ డ్రోన్‌ వ్యవస్థల ధర మాత్రం ఐదు వేల డాలర్ల నుంచి ఏకంగా 50 లక్షల డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. దీంతో పాక్‌ సైన్యం ప్రస్తుతం ‘ఖరీదైన టెక్నాలజీ ఎందుకు.. వల ఉంటే చాలదా?’ అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

కోహట్‌, కరక్‌, బన్నూ, లక్కీ మార్వత్‌, డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాల్లోని సైనిక స్థావరాల వద్ద ఇప్పటికే ఈ వలలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అయితే ఈ పద్ధతిపై నిపుణులు మాత్రం పెద్దగా నమ్మకం పెట్టుకోవడం లేదు. ఫిషింగ్‌ నెట్స్‌ రక్షణ ఇవ్వలేవని హెచ్చరిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్లు, చెక్‌పోస్టులే ఎప్పుడూ డ్రోన్ల లక్ష్యాలు కావని.. కీలక ప్రాంతాలను టార్గెట్‌ చేసి భారీ ప్రభావం చూపించడమే మిలిటెంట్ల ఉద్దేశం కావచ్చని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌కు చెందిన ఇమ్తియాజ్‌ గుల్‌ అన్నారు.

డ్రోన్లు గాల్లోకి ఎగిరిన వెంటనే వాటిని గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ఇప్పటికే చైనా, టర్కీకి చెందిన యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. అయితే వాటి సామర్థ్యాలపై గత ఏడాది ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రశ్నలు తలెత్తాయి. దీంతో అమెరికాకు చెందిన పవర్‌యూఎస్‌ సంస్థ నుంచి యాంటీ డ్రోన్‌ వ్యవస్థను తీసుకునే ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు టీటీపీ కూడా డ్రోన్‌ దాడులను పెంచుతోంది. 2025 డిసెంబర్‌లో ప్రత్యేక డ్రోన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చౌకగా లభించే కమర్షియల్‌ డ్రోన్లకు మార్పులు చేసి దాడులకు ఉపయోగిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

2026 తొలి ఆరు నెలల్లో ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలో 341 డ్రోన్‌ దాడులను అడ్డుకున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. మరో 100 దాడుల్లో సుమారు 30 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. 90 మంది గాయపడ్డారు.

డ్రోన్‌ యుద్ధంలో ఒకవైపు టెక్నాలజీ పరుగులు పెడుతుంటే.. పాకిస్థాన్‌ మాత్రం ప్రస్తుతానికి చేపల వలలతో వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ‘జుగాడ్‌’ డ్రోన్లను నిజంగా అడ్డుకుంటుందా.. లేక పాక్‌ భద్రతా సిబ్బందికి కేవలం ధైర్యం మాత్రమే ఇస్తుందా అన్నది చూడాలి.
Advertisement
Pakistan
Drone attacks
Fishing nets
Tehreek-i-Taliban Pakistan
Anti drone system
Khyber Pakhtunkhwa

More Telugu News