టాటా ట్రస్ట్‌లలో ముసలం.. లిస్టింగ్‌పై ట్రస్టీల మధ్య భగ్గుమన్న విభేదాలు

టాటా ట్రస్ట్‌లలో ముసలం.. లిస్టింగ్‌పై ట్రస్టీల మధ్య భగ్గుమన్న విభేదాలు

Tata Trusts discord Differences flare up between trustees over Tata Sons listing
  • వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌పై తోటి సభ్యుల తీవ్ర ఆరోపణలు
  • బోర్డు తీర్మానాలకు విరుద్ధంగా లిస్టింగ్‌కు మద్దతిస్తున్నారని వ్యాఖ్య‌
  • కంపెనీని అన్‌లిస్టెడ్‌గా ఉంచాలనేది ఏకగ్రీవ నిర్ణయమంటున్న‌ సీనియర్లు
భారత కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే అంశంపై 'సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్' (ఎస్‌డీటీటీ)లో తీవ్రమైన అభిప్రాయభేదాలు తలెత్తాయి. ట్రస్ట్‌లోని తోటి సభ్యులైన వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లు బోర్డు తీర్మానాలను బలహీనపరుస్తున్నారని, తమ బాధ్యతలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ సీనియర్ ట్రస్టీలు ఒక లేఖ రాసినట్లు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' తన కథనంలో వెల్లడించింది.

ఈ లేఖపై సీనియర్ ట్రస్టీలు నోయెల్ ఎన్ టాటా, డారియస్ జె. ఖంబటా, నెవిల్లే ఎన్. టాటా, భాస్కర్ భట్ సంతకాలు చేశారు. టాటా సన్స్‌ను లిస్టింగ్ చేయకుండా ప్రైవేట్‌గా (అన్‌లిస్టెడ్) కొనసాగించాలనేది చాలా ఏళ్లుగా ట్రస్ట్‌లు, కంపెనీ తీసుకున్న స్థిరమైన నిర్ణయమని వారు తమ లేఖలో స్పష్టం చేశారు. 

మార్చి 2024లో టాటా సన్స్ బోర్డు కూడా కంపెనీని అన్‌లిస్టెడ్‌గానే ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తర్వాత జూలై 2025లో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ సభ్యులు కూడా ఇదే నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. ఈ విషయంపై ఆర్బీఐతో చర్చించాలని కూడా అంగీకరించారు.

అయితే, ఈ తీర్మానాలను పక్కనపెట్టి, ట్రస్ట్‌లలో పునఃపరిశీలన కోరకుండానే వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లు బహిరంగంగా లిస్టింగ్‌కు మద్దతుగా ప్రకటనలు చేయడంపై సీనియర్ ట్రస్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి చర్యలు ట్రస్ట్ తీర్మానాలకు విఘాతం కలిగించడమే కాకుండా, ఆర్బీఐతో జరుపుతున్న చర్చలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్బీఐ నిర్దేశించిన 'నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ' (ఎన్‌బీఎఫ్‌సీ) నిబంధనల నుంచి టాటా సన్స్‌కు మినహాయింపు లభించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ట్రస్టీలు తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28న టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్‌ను టాటా సన్స్‌లో విలీనం చేసే ప్రతిపాదనను కూడా పరిశీలించినట్లు వారు పేర్కొన్నారు. 

ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేవలం లిస్టింగ్ మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని టాటా సన్స్ బోర్డు తమను కోరిందని, తాము అదే పని చేస్తున్నామని లేఖలో ట్రస్టీలు తమ చర్యలను సమర్థించుకున్నారు. ఈ పరిణామాలు టాటా సన్స్ భవిష్యత్తు, యాజమాన్య హోదాపై ట్రస్ట్‌లోని సభ్యుల మధ్య పెరుగుతున్న విభేదాలను స్పష్టం చేస్తున్నాయి.
Advertisement
Tata Sons
Tata Trusts
Noel Tata
Tata Sons IPO
Venu Srinivasan
RBI NBFC norms

More Telugu News