ఏపీలో వర్ష బీభత్సం.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

ఏపీలో వర్ష బీభత్సం.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

Kinjarapu Atchannaidu issues key directives to officials on AP rain havoc
  • తీవ్ర వాయుగుండం వల్ల రాష్ట్రంలో పంట నష్టంపై తక్షణ అంచనాకు ఆదేశం
  • పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచన
  • ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్
  • పొలాల్లోని నీటిని తొలగిస్తూనే, భవిష్యత్తు కోసం నిల్వ చేయాలని దిశానిర్దేశం
  • రైతులకు సాంకేతిక సలహాలు అందించి అండగా నిలవాలని స్పష్టం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్టు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేసినట్టు ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడితి రాజశేఖర్‌, ఇతర ఉన్నతాధికారులతో పాటు పార్వతీపురం మన్యం, డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై వెంటనే క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించి, వివరాల నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడం, అధిక తేమ వల్ల పంటలు దెబ్బతినకుండా రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించి, వారిలో అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా దెబ్బతిన్న ముఖ్యమైన రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను సమీక్షించాలని స్పష్టం చేశారు.

అదే సమయంలో, ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని సాధ్యమైనంత మేర సంరక్షించుకోవాలని మంత్రి సూచించారు. పంటలకు హాని కలిగించే చోట నీటిని తొలగిస్తూనే, చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో నీటిని నిల్వ చేసి భవిష్యత్తు సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు, ప్రజలకు నిరంతర సహాయం అందించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Advertisement
Kinjarapu Atchannaidu
Andhra Pradesh heavy rains
AP crop damage assessment
Agriculture Minister Atchannaidu
AP rain havoc updates
Srikakulam Konaseema rains

More Telugu News